సాంఖ్య యోగము
భగవద్గీత
మనోభావాలు మొదలుకొని బాహ్యమైన ఆకాశం వరకు అన్నీ ఉన్నట్టు దానికే స్ఫురిస్తున్నాయి. అంటే దానికి భిన్నంగా ఇవి లేవు. వీటి పాటికివి అసత్. లేనివే. స్వతహాగా లేకున్నా ఇవి ఇలా ఉన్నట్టు మనకు భాసిస్తున్నా యంటే దాని మూలంగానే భాసిస్తున్నాయి. మూలభూతమైన ఆ జ్ఞానం మనకు వీటిలాగా గోచరించటం లేదు. భావం నిరాకారంగదా ఎలా గోచరిస్తుంది. నిరాకారమైనా సుఖాదులైన భావాలు గోచరించటం లేదా అని అడగవచ్చు. సుఖదుఃఖాదులు మన స్వరూపం కావు. మన జ్ఞానానికి సోకే భావాలు. మరి జ్ఞానమో అది సాక్షాత్తూ మన స్వరూపమే. స్వరూపం గనుకనే అది మనకు గోచరం కాదు. కానక్కరలేదు. మన మున్నట్లు మనకు తెలియదా. ఇక క్రొత్తగా గోచరించటం దేనికి. గోచరించకుండానే మనోభావాల దగ్గరినుంచీ సమస్త ప్రపంచాన్నీ గోచరింప చేసుకొంటుంది. గోచరించేదంతా దాని మీద ఆధారపడితేనే వాటి కస్తిత్వం. అంచేత వాటి పాటి కవి అసత్. పోతే దేనిమీదా ఆధారపడక తన పాటికి తానుండ గలదు కాబట్టి జ్ఞానమొక్కటే సత్.
అయితే సత్తయినా ప్రపంచంలాగా మన ఎదటికి వచ్చి కనపడని నేరానికి మన స్వరూపమైన జ్ఞానాన్నే మన మసత్తని భావించాము. కనపడుతున్నాయి గనుక అ సత్తయినా ఈ ప్రపంచాన్నంతా మనం సత్తని బోల్తా పడుతున్నాము. కనుకనే గీతాశాస్త్ర మిప్పుడు మనం చేస్తున్న తప్పు సరిదిద్దుకోమని మందలించి చెబుతున్నది. లేని అనాత్మ ప్రపంచం
Page 75