#


Index

కథా సంవిధానము

పాలుపరిచింది కథానాయకుణ్ణి. దీనితో చివరకు కథానాయకుడొక్కడే మిగిలాడు మనకు. అంతేకాదు ఆయన కాయనే ఇప్పుడు సమస్య అయి కూచున్నాడు. అంటే తన అవతారమే తనకిప్పుడు సమస్య. మానవావతారంతో కదా జన్మించాడు పరమాత్మ. దానివల్ల కావలసిన ప్రయోజనం సాధించాడిక అది దేనికి. ఇంకా ఉంటే అది నిష్ప్రయోజనం. తనకే అది బరువు. అందుచేత అది ఉరువు లేకుండా పోవాలి. అప్పుడే శాశ్వతమైన పరిష్కారం సమస్యకు. ఆ పరిష్కారమే రాముడి సరయూ ప్రవేశమూ, వైకుంఠ గమనమూ, దీనితో కథా గమనంలో తిరిగిన ఆఖరి మలుపు కూడా సమాప్తమయి అక్కడికి కథే ముగిసిపోయింది. నదీప్రవాహం సముద్ర జలంలో కలిసి లయమయినట్టే కథా నదీప్రవాహం కూడా ఆయా ఘట్టాలలో ఆయా మలుపులు తిరుగుతూ ప్రవహించి ప్రవహించి చివరకు కథానాయకుడితో పాటు సరయూ జలంలోనే చేరి లయమవుతున్నది.

  అసలు కథా గమనమిలా సహజ సుందరంగా సాగటానికక్కడక్కడా మరమేకుల లాగా కొన్ని కీలకమైన పాత్రలను చెక్కుతూ పోతాడు మహర్షి. అవి అంతకంతకు కథా తరంగిణిని అంచెలవారీగా ముందు ముందుకు తోసుకుంటూ పోయి చివరకు దాన్ని గమ్యస్థానానికి చక్కగా తీసుకెళ్లి చేరుస్తాయి. బాలకాండలో మారీచుడి పాత్ర కథా గతిలో మొట్టమొదటి కీలకం. మారీచుణ్ణి రాముడు చంపడు. దూరంగా విసరికొడతాడు. వాడా బాణవేగానికి వచ్చి సరాసరి దండకారణ్యంలో పడతాడు. తాటకనూ సుబాహుణ్ణి వధించిన రాముడు వాడితమ్ముడైన మారీచుణ్ణి వధించక పోవటమేమిటి. వాడివల్ల తరువాత ఒక పెద్ద ప్రయోజనముంది. వాడేగదా మాయలేడి రూపంలో వచ్చి రామలక్ష్మణులను దూరంగా కొనిపోయింది. తన్మూలంగానే గదా సీతాపహరణం జరిగింది. అందుచేత మారీచుడప్పుడే చావగూడదు. రాముడరణ్యానికి వచ్చేదాకా కనిపెట్టుకొని ఉండాలి. మరి రాముడరణ్యానికెలా వస్తాడు. పట్టాభిషేకం చేసుకొని సాకేతరాముడై అయోధ్యలోనే కూచుంటే ఎలాగ ? కోదండరాముడై అరణ్యంలో ప్రవేశించాలి. ప్రవేశించాలంటే పట్టాభిషేకం తప్పకుండా భంగం కావాలి. దానికెవరో ఒకరు పుణ్యం కట్టుకొని తీరాలి. కట్టుకొన్నది మంథర అనే దాసి. జ్ఞాతిదాసీయతోజాతా.కైక నదిచిన్నప్పటినుంచీ పెంచి పెద్ద చేసిన దాది. అంతవరకూ తెరమరుగునున్న ఆ పాత్ర హఠాత్తుగా తెర తీసుకొని ముందుకు వస్తుంది. కైక

Page 71

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు