#


Index

కథా సంవిధానము

సుఖంగా. కాని అంత సుఖంగా చేరటానికి లేదు. మరలా ఒక సమస్య ఏర్పడిందక్కడ. అది మహర్షులను కాపాడే బాధ్యత. అందుకోసం ఖరదూషణాది సంహారం. అది చారులవల్ల తెలుసుకొని రావణుడు పగబూని రంగంలో ప్రవేశించటం. దాని ఫలితంగా సీతాపహరణం. ఇది మూడోమలుపు కథా గమనంలో. ప్రతి ఘట్టంలో ఒక సమస్యా. దాని పరిష్కారం కోసం కథలో ఒక మలుపు. అదంతా కలిసి ఒక కాండ. ఉన్నట్టుండి విశ్వామిత్రుడి తపస్సుకు విఘ్నం ఏర్పడటం ఒక సమస్య. ఆ సమస్యకు పరిష్కారం అతడు రాముణ్ణి వెంట బెట్టుకొని పోవటం. తాటకాదులను వధించి రాముడు సీతా కళ్యాణం చేసుకొని నగరంలో ప్రవేశించటంతో అక్కడికి బాల సమాప్తమయింది. పోతే పట్టాభిషేకానికి భంగమేర్పడటంతో మరొక సమస్య తల ఎత్తి రాముడి అరణ్య గమనంతో అది సమాప్తమయింది. దానితో అయోధ్యకాండ కూడా ముగిసింది. పోతే ఈ అరణ్యంలో మరలా శిష్ట జన రక్షణ ఒక సమస్య అయి అందుకోసం దుష్ట రాక్షసులను శిక్షించవలసి వచ్చి అది ఎక్కడో దూరంగా లంకలో ఉన్న రావణుణ్ణి దండకారణ్యంలోకి లాగుకొని వచ్చింది. అతడు సీతాపహరణం చేయటంతో ఇప్పుడు నాలుగవ సమస్య ఒకటి ఏర్పడింది. దీనితో మరొక మలుపు తిరిగింది కథ.

  ఈ నాలుగవ మలుపుతో అరణ్యకాండ సమాప్తమయి కిష్కింధలో అడుగుపెట్టాము మనం. కిష్కింధ చేరిన రాముడు సుగ్రీవుడితో సఖ్యం చేసి వాలిని వధించి అతణ్ణి పట్టాభిషిక్తుణ్ణి భార్యానుషక్తుణ్ణి చేయగలిగాడే గాని తన రాజ్యప్రవేశం కాకపోయినా పత్నీ ప్రణాశమింకా పరిష్కారం కాలేదు. అది సమస్యగానే మిగిలిపోయింది. దాన్ని పరిష్కరించటం కోసం బద్ధకంకణుడైన సుగ్రీవుడు వానర సైన్యాన్ని సీతాన్వేషణార్థం నలుదిక్కులకూ పంపటం, అందులో హనుమదాదులను దక్షిణ దిశకు పంపటం, దక్షిణ సముద్రతీరాన దిక్కుతోచక అంతా నిర్విణులై కూచొని ఉంటే సంపాతి సీతా వృత్తాంతం బయటపెట్టటంతో సమస్య అక్కడికి సమాప్తమయి కిష్కింధాకాండ కూడా దానితో సమాప్తమవుతుంది. పోతే ఆ సమస్య తీరినా ఇప్పుడు మరొక సమస్య తల ఎత్తింది అది శతయోజన విస్తీర్ణమైన సాగరాన్ని ఎలా దాటటమా, ఎవరు దాటటమా ? అని ఈ సమస్యతో కథ మరొక మలుపు తిరిగితే దానితో కిష్కింధ నుంచి మనం అయిదవదైన సుందరకాండలో ప్రవేశించాము. ఇది ఆ

Page 69

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు