#


Index

కథా సంవిధానము

వెనుకటి జలాలను కలుపుకొంటూ ముందు ముందుకు దూసుకు పోతుంది. ఒక్కొక్క ఘట్టంలో ఒక్కో మలుపు తిరగటం కూడా సహజమే. ఒక్కో మలుపు కొంతవరకూ నడచిన తరువాత మరోమలుపు కది దారి తీస్తుంది. అది ఇంకో మలుపుకు దోహదం చేస్తుంది. ఇలాగా ఎన్ని మలుపులు తిరగాలో అన్ని మలుపులూ తిరిగి ఒక నది చివరకు సముద్రంలో కలిసినట్టే కథావాహిని కూడా తనకు నిర్దిష్టమైన గమ్యం చేరి సమాప్తమవుతుంది. ఇక్కడ కూడా ఉంది రామాయణ కథా రామణీయకం. బాలదగ్గరి నుంచి ఉత్తర వరకూ నడచిన ఏడు కాండలూ కథా భాగీరధికి ఏడు మణికర్ణికాది ఘట్టాలలాంటివి. ఒక్కొక్క ఘట్టాని కొక్కొక్క మలుపు తిరుగుతుంది కథ. అక్కడికి కావలసిన జలాన్ని పుంజుకొని మరలా ముందరికి సాగుతుంది. చూడండి. బాలకాండలో రామాదులు జన్మిస్తారు. జన్మించిన రాముడు పెరిగి పెద్దవాడయి పెండ్లి వయసు వస్తుంది. వెంటనే విశ్వామిత్రుడు వచ్చి ఆ బ్రహ్మచారిని వెంట బెట్టుకొని పోయి అన్ని విద్యలలో సిద్ధహస్తుణ్ణి చేసి అతనిచేత శివధనుర్భంగం చేయించి సీతతో వివాహం జరిపి ఒక ఇంటివాణ్ణి చేసి వెళ్లిపోతాడు. దీనితో బాలకాండ సమాప్తం. ఇక గృహస్థుడైన రాముడు రాజ్యపదస్థుడు కావలసి ఉంది. కాని అనుకోకుండా దానికి అంతరాయ మేర్పడటంతో కథ మలుపు తిరిగింది. దాని ఫలితంగా అయోధ్య నుంచి అతడి కరణ్యాని కుద్వాసన ఏర్పడింది. బాలకాండలో ఒకసారి అయోధ్య నుంచి ఉద్వాసన అయ్యాడీ కథానాయకుడు. విశ్వామిత్రుడి వెంట వెళ్లటం ఉద్వాసనే గదా. అయితే అది గురువుగారి వెంట వెళ్లటం. అందులోనూ కళ్యాణరాముడై రావటం కాబట్టి మంచిదే. కాని కళ్యాణ పట్టాభిరాముడు కాకుండా విధి అడ్డపడి ఆ అయోధ్య నుంచే మరలా అరణ్యానికి ఉద్వాసన చేయటం. ఇది రెండో మలుపు.

  సరే అయోధ్యను విడిచి వెళ్లినా అరణ్యాన్ని కూడా అయోధ్యగానే చూడగల మహానుభావుడాయన. “నవనం గంతుకామస్య త్యజతశ్చ వసుంధరామ్ - సర్వ లోకాతి గస్యేవ - లక్ష్యతే చిత్తవిక్రియా" అని ఆయన విక్రియారాహిత్యాన్ని అయోధ్యవాసులే వేనోళ్ల కొనియాడారు. దండకారణ్యంలో ప్రవేశించి అక్కడ నివాస మేర్పరచుకొన్న తరువాత ఇక సమస్య ఏముంది. ఏమీ లేదు వాస్తవంలో. కైక పెట్టిన పద్నాలుగు సంవత్సరాల గడువూ ముగించుకొని మరలా అయోధ్య చేరవచ్చు

Page 68

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు