#


Index

కథా సంవిధానము

  అయోధ్యలో ముందుగా భరతుడు మాతుల గృహానికి వెళ్ళిపోవటం దశరథుడికి వెంటనే రాముణ్ణి రాజ్యాభిషిక్తుణ్ణి చేయాలనే బుద్ధి పుట్టటం ఉన్నట్టుండి దానికి కైకవల్లనే విఘ్నమేర్పడటం రామవియోగంతో తండ్రి మరణించటం, దానికంతకు ముందే మహర్షి శాపం కారణంగా ఆయన వర్ణించటం. ఇలా పూర్వాపరాలను కలపటమే. సీతారాములతో పాటు మన మరణ్యం చేరేసరికి మార్గమధ్యంలో భరద్వాజుడూ గుహుడూ ప్రత్యక్షమవుతారు. వారెప్పటినుంచో ఆయన రాకకోసం ప్రతీక్షిస్తుంటారు. ఇవి గతాన్ని సూచిస్తే రామలక్ష్మణులు తమ తండ్రి దశరథుడి చర్యను గూర్చీ భరతాదులను గూర్చీ ఏకాంతంగా చర్చించుకోవటం రాబోయే భరతాగమనాన్నీ పాదుకాప్రదానాన్నీ ప్రవచిస్తుంది. పోతే అరణ్యకాండలో అడుగు పెట్టామంటే విరాధాది రాక్షసులూ, శరభంగాది మహర్షులూ ఆయన రాకకోసం చూస్తుంటారు. అగస్త్యాదులూ అంతే. మరి జటాయువు ఎవరోకాదు. దశరథుడికి ప్రాణ స్నేహితుడు. ఇదంతాముందు కాలాన్ని ఒకవైపు గుర్తుకు తెస్తే మరొకవైపు అస్త్రశస్త్రాదులు తాపసులు ధరించే అవసరమేమిటని సీత అడిగిన ప్రశ్నకు రాముడు సమాధానం చెప్పటం రాబోయే ఖరదూషణాది విధా- మారీచవధా మన మనసుకు తేకమానదు. అంతేకాదు. జటాయువు రాముణ్ణి చూచి “సోహమ్ వాససహాయస్తే భవిష్యామి యదీచ్ఛసి - ఇదం దుర్గంహి కాంతారం మృగరాక్షస సేవితమ్ సీతాంచ తాతరక్షిష్యే - త్వయియాతే సలక్ష్మణే" అని యాదృచ్ఛికంగా చెప్పినమాట కూడా తరువాత యధార్ధంగానే జరగటంలో ఎంతో భావ్యర్థసూచన కనిపిస్తుంది.

  ఇక అరణ్యకాండ చివరలో శాపవిముక్తుడైన కబంధుడు రామలక్ష్మణులకు కిష్కింధమార్గం ప్రదర్శించటమూ, వాలి సుగ్రీవుల వృత్తాంతం చెప్పి సుగ్రీవుడితోనే సఖ్యం చేయమని బోధించటంకూడా భావ్యర్థ సూచనే. మరి కిష్కింధలో సుగ్రీవుడు రాముడికి తన గత జీవిత విశేషాలన్నీ ఏకరువు పెడుతుంటే మనం గతాన్ని స్మరిస్తూ హనుమంతుడికి అంగుళీయకాన్ని ఇచ్చి పంపటంలో రాబోయే సీతా దర్శన వృత్తాంతాన్ని ఊహించుకోగలం. అసలు సీత ఆభరణాలు ఋశ్యమూకం మీదనే పడవేయటం, రావణుణ్ని పరాభవించిన వాలిని రాముడు అవలీలగా కూల్చివేయటం, ఇవి రెండూ ముందు జరిగిన వృత్తాంతాలు. తరువాత సుగ్రీవాదుల సహాయంతోనే అతడు రావణ సంహారం చేయబోతాడనే రహస్యం చెప్పకుండానే చెబుతున్నాయి.

Page 66

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు