దాటి ప్రసరిస్తున్నాయి. బాలలో దేవలోకం. అయోధ్యలో మానవలోకం. అరణ్యలో తాపసలోకం. కిష్కంధలో వానరలోకం. సుందరలో దానవలోకం. యుద్ధలో ఈ చెప్పిన అన్ని లోకాలూ. ఇన్ని లోకాలు మనకు సాక్షాత్కరిస్తున్నాయంటే అది దైశికమైన అవధులను దాటిపోయిందనే గదా అర్థం. అలాగే దేవ దానవ మానవ పశుపక్ష్యాదులన్నిటినీ వర్ణించిందంటే పాత్రల అవధులను కూడా దానితో పాటు గడచిపోయింది గదా. అంతేకాదు. దేశపాత్రలను రెంటినీ నడిపేది కాలమనే మూడవ పరిధి. అదికూడా హద్దులు లేకుండా సాగింది రామాయణంలో. ఎక్కడి కక్కడ జరిగిపోయిన వృత్తాంతాన్ని స్మరించటమూ భవిష్యద్వృత్తాంతాన్ని సూచించటమూ చేస్తుంటాడు వర్తమానాన్ని వర్ణిస్తూనే వాల్మీకి మహర్షి. ఇది కూడా ఎంతో సహజ సుందరంగా చేస్తూ పోతాడు. మన మా పాత్రలతో పాటు వర్తమానంలోనే ఉంటాము. కాని వారి మధ్యనే ఉండి మనం వారితో పాటు వెనుకటి కథలు వింటుంటామూ. రాబోయే వ్యవహారం ముందుగానే తెలుసుకొంటుంటాము. ఇది మహర్షి సాధించిన ఒక అతిలోకమైన శిల్పం.
విశ్వామిత్రుడి వెంట రామలక్ష్మణులు వెళ్లుతుంటారు బాలకాండలో. వారి కాయన ఎన్నెన్నో జరిగిపోయిన కథలన్నీ ఏ కరువు పెడుతుంటాడు. వారందరూ ఉన్నది వర్తమానంలో. మనమూ పాఠకులుగా వారితోపాటు వర్తమానంలోనే ఉన్నాము. కాని ఆ గురువుగారు వెనుకటి విషయాలన్నీ చెబుతుంటే రామలక్ష్మణులతో పాటు మనం కూడా తాత్కాలికంగా వర్తమానం నుంచి ఒక్కసారిగా భూతకాలంలోకి ఎవరో మోసుకుపోయినట్టు వెళ్లిపోతాము. ఆకాలంలో ఆ లోకంలో విహరిస్తుంటాము. అలాగే యజ్ఞ సంరక్షణ అయిన తరువాత రాబోయే మిథిలాపుర వృత్తాంతమూ అందులో శివధనుర్వృత్తాంతమూ ఆయన చెబుతుంటే రాముడితో పాటు మనమూ చెవులు దోరగించుకొని ఎంతో కుతూహలంతో వింటుంటాము. అలాగే శివధనుస్సు ఎలా వచ్చింది దాని పూర్వవృత్తాంతం జనకుడు వర్ణించటం అది రాముడు భగ్నం చేస్తాడనే అంశం జనక విశ్వామిత్రుల సంవాదం సూచించటం అలాగే వివాహానంతరం పరశురాముడి ఆగమనాన్ని సూచించే సందర్భాలు ముందుగా ఏర్పడటం ఇవన్నీ ఎంతో చమత్కారాన్ని కలిగిస్తాయి మనకు.
Page 65