కాగా ఇక హనుమంతుడి ఉదంతంకూడా మనకు మొదట చిత్రంగానే తోస్తుంది. మిగతా వానరులకెవరికీ లేని ఆ బలపరాక్రమాలాయన కెలా సంక్రమించాయనే విషయంగాని రాముడనే వాడెవరో తనకు ముందు తెలియకపోయినా అతణ్ణి చూడగానే ఎంతో కాలం నుంచి ఆయన కోసం కనిపెట్టుకొని చూస్తున్న మహాభక్తుడి లాగా కనపడటంగాని, పూర్వరామాయణం చదువుతున్నంతవరకూ మనకంతు పట్టదు. ఉత్తర రామాయణంలోనే మనకా రహస్యం బయటపడుతుంది. అగస్త్యుడు ప్రసంగవశాత్తూ హనుమంతుడి జన్మ వృత్తాంతం చెబుతాడు. దేవతలాయన కెన్నో వరాలిస్తారు. బ్రహ్మవారితో ఇలా అంటాడు. అనేన శిశునా కార్యమ్ కర్తవ్యమ్ వో భవిష్యతి మీపనికోసమే ఇతడు జన్మించాడు. తరువాత మీ కార్యం తప్పకుండా సాధిస్తాడు. మీరితనికి మీమీ వరాలన్నీ ప్రసాదించండి. అలా చేస్తే భవత్యవ్యాహత గతిః కీర్తిమాంశ్చ భవిష్యతి. రావణోత్సాదనార్థాని - రామప్రియ కరాణిచ రోమహర్ష కరాణ్యేష కర్తా కర్మాణి సంయుగే రావణ సంహారానికీ రామప్రమోదానికీ కావలసినదంతా ఇతడు సాధించగలడు. అని ముందుగానే సూచిస్తాడు. దానికి తగినట్టుగానే అవ్యాజమైన అజ్ఞాతమైన ఒక భక్తి భావం రాముడిమీద ఆయన కేర్పడింది మొదటినుంచీ. అలా ఏర్పడటానికి కారణమేదో అది మొదట మనకు తెలియకపోయినా ఇప్పుడీ బ్రహ్మదేవుడి మాటలతో బోధ పడుతుంది. అలాంటి అవ్యాజానురాగం తనకున్నట్టు మరలా పట్టాభిషేకానంతరం హనుమంతుడే రాముడితో ఇలా బయటపెడతాడు. స్నేహోమే పరమో రాజంస్త్వయితిష్ఠతి నిత్యదా భక్తిశ్చ నియతావీర భావో నాన్యత్ర గచ్ఛతు.
ఇదంతా ఇక్కడ ఎందు కేకరువు పెట్టటమంటే పూర్వోత్తర కథా భాగాలకుండే అనుబంధ మెలాంటిదో చూపటానికి. ఉత్తరం లేకపోతే పూర్వంలేదు. పూర్వంలో జరిగిన సంఘటలన్నిటికీ ఉత్తరం ఉత్తరదాయి. ఇది వృక్షమైతే అది బీజం. బీజం అంకురించి పల్లవించి పుష్పించి ఫలిస్తుంది. శాఖోపశాఖలై ప్రసరిస్తుంది. అలాగే జరిగిందిక్కడా. అయితే చమత్కారమేమంటే లోకంలో బీజం ముందు అంకురాదులా తరువాత ఏర్పడతాయి. మరి ఈ వాల్మీకి లోకంలో అలా కాదు. అంకురాదులే మనకు పూర్వం దర్శనమిస్తాయి. ఇవి ఏమిటా ఎందుకా ఎలాగా అని అన్వేషిస్తూ పోతే ఉత్తరత్రా వాటి మూలం మనకు బయటపడుతుంది. ఇలా
Page 62