వారి ఉదంతం రావణుడికి సీత నపహరించి తెమ్మని ఉపాయం కూడా వాడే బోధ చేస్తాడు. ఆ తరువాత శూర్పణఖ కూడా వెళ్లి అదే మాట చెబుతుంది. మొదట మారీచుడి సలహామేరకు వెనుకకు మళ్లి పోయినవాడు కూడా రెండవ మారు అలా వెళ్లలేదతడు. మొండిపట్టు పట్టి సీతాపహరణానికే పూనుకుంటాడు ఆ పిమ్మట ఎవరెంత చెప్పినా వినడు. మారీచుడు చెప్పినా వినడు. విభీషణుడు చెప్పినా వినడు. మందోదరి చెప్పినా వినడు. ఆవిడ మూలంగా తనకు చావు తప్పదని చెప్పినా వినడు. ఏమిటీ మొండితనం. దీనికి పూర్వ రంగమెంతో ఉంది. అది ఉత్తరంలోనే బయటపడుతుంది మనకు. ఇంతకుముందే చెప్పాము అనరణ్యుడు శపించాడని. వేదవతి శపథం చేసిందని. రెండూ కలుపుకొని చూస్తే సీతారాములు తన వధ కోసమే అవతరిస్తారని అవతరించారని తెలుసు రావణుడికి. దానికి తోడు తన తాతలు మాల్యవదాదులెప్పుడో చెప్పారు విష్ణువు తమ జాతికి పగవాడని ఆ విష్ణువే రాముడుగా అవతరించాడు. ఆయననేగా చేసుకొంటానని వేదవతి తనకు చెప్పింది. పైగా వానరులతోనే సఖ్యం చేస్తాడని వారితోనే తన మీదికి వస్తాడని తెలుసు వాడికి. కారణమేమంటే కైలాసాన్ని కదలించే ముందు ద్వారం దగ్గర తన్ను వారించిన నంది వానరముఖాన్ని చూచి అపహసిస్తాడు. అందులకానంది కోపించి “యస్మాద్వానర రూపంమా మవజ్ఞాయ దశానన - అశనీపాతసంకాశ ముపహాసం ప్రయుక్తవాన్ - తస్మాన్మద్రూపసంపన్నా మద్వీర్యసమతేజసః ఉత్పత్స్యంతి వధార్థమి కులస్య తవవానరాః" వానరముఖుడని నన్నపహసించావు. ఇలాంటి వానరముఖులే కోటానకోట్లు జన్మించి కొంతకాలానికి నిన్నూ నీవంశాన్నీ రూపుమాపుతారు పొమ్మని శపిస్తాడు. ఇలాంటి వ్యవహారాలన్నీ అంతకుముందే జరిగి ఉన్నాయి గనుకనే ఎంత లేదన్నా అవన్నీ తన మనసులో ఒక ప్రక్క మెదులుతున్నాయి గనుకనే అలాగే ప్రవర్తిస్తూ వచ్చాడా దానవుడు. అది విధిప్రేరణ వల్లనైనా కావచ్చు. ఆ విధి తన్నేమి చేస్తుందో చూస్తామనే వరగర్వంతోనైనా కావచ్చు. కనుకనే అకస్మాత్తుగా రాముడితో వైరం-సీతాపహరణం-ప్రత్యర్పణ నిరాకరణం చివరదాకా ఒక వ్రతంగా పాటించాడా అనిపిస్తుంది. ఇది మొదట ఎందుకిలా జరుగుతూ వస్తున్నదో అర్ధంకాదు మనకు. అదికథలో ఒక ముడి. ఆ ముడి ఈ ఉత్తరకాండలో వరుసగా జరిగిన వృత్తాంతాలు వినేదాకా విడిపోదు.
Page 61