#


Index

కథా సంవిధానము

  ఈవిధంగా రాముడి వృత్తమే గాక సీత పూర్వవృత్తం కూడా మనకు ఉత్తరకాండ చూడనంతవరకూ బోధపడదు. బాలకాండలో వస్తుంది సీతా జన్మవృత్తాంతం మొదట. విశ్వామిత్రుడి కావిడ విషయం చెబుతూ జనకుడిలా అంటాడు. “అథమేకృషతః క్షేత్రమ్ - లాంగలాదుద్ధితా మమక్షేత్రం శోధయతా లబ్దానామ్నా సీతేతి విశ్రుతా.” ఈ సీత నా గర్భవాసాన జన్మించింది కాదు. యజ్ఞార్ధమని నేను క్షేత్రం దున్నిస్తూంటే నాగేటి చాలునుంచి జనించింది కన్య. అప్పటి నుంచీ సీత అని పేరు పెట్టి ఈవిడను మేమెంతో గారాబంగా పెంచుకొంటున్నామని అంటాడు. క్షేత్రం దున్నటమేమిటి. నాగటి చాలు నుంచి ఒక కన్య ఆవిర్భవించటమేమిటని ఆశ్చర్యంగా ఉంటుంది మనకు. ఈ ఆశ్చర్యం ఉత్తరకాండలో ఆవిడ పూర్వవృత్తాంతం చదివేదాకా ఆశ్చర్యమే. అక్కడ దొరుకుతుంది దీనికి పరిష్కారం. ఈవిడ పూర్వం వేదవతి అనే తాపస కన్య. కుశధ్వజుడనే బ్రహ్మర్షి కూతురు. వేదాధ్యయనం చేస్తూండగా ప్రాదుర్భవించింది. అతడు తన బిడ్డను విష్ణువు కిచ్చి వివాహం చేయాలని సంకల్పించి ఎవరికీ ఇవ్వకపోగా దంభుడనే రాక్షసుడొక డసహిష్ణువై ఆయన నిద్రిస్తుండగా వచ్చి వధిస్తాడు. ఆయన పత్ని అదిచూచి దుఃఖించి పతితోపాటు సహగమనం చేస్తుంది. తరువాత వేదవతి తండ్రి సంకల్పం నెరవేరాలని దీక్షతో హిమవత్సానువులలో తపస్సు చేస్తుంటుంది. ఒకనాడు రావణుడు పుష్పకంతో విహరిస్తూ యాదృచ్ఛికంగా ఆవిడను చూస్తాడు. దిగివచ్చి ఆవిడ వృత్తాంతమడిగితే పూసగ్రుచ్చినట్టు అంతా నివేదిస్తుంది. ఆ విష్ణువెవడు, నన్ను పెండ్లాడమని బలవంతం చేయబోతాడు. దానికి క్రుద్ధురాలై ఆవిడ యోగాగ్నిలో దగ్ధమవుతూ రాబోవు జన్మలో నేనొక మహాత్ముడికి అయోనిజనై మరలా జన్మించి నా కభీష్టుడైన నారాయణుణ్ణి వరించి నీ వధ ఆయన చేతిలో జరిగేలా చూస్తానని శపథం చేస్తుంది. ఆవిడే నీకీ జన్మలో సీత అనేపేర భార్య అయిందని చెబుతాడు అగస్త్యుడు రాముడితో. ఇది ఉత్తరకాండలో వచ్చే విషయం.

  పోతే రావణుడు మొదటినుంచీ మనకు రామాయణంలో కనపడడు. మధ్యలో ఏ అరణ్యకాండలోనో దర్శనమిస్తాడు. సీతారాముల విషయమంత వరకూ అతనికే మాత్రమూ తెలియదనే అనిపిస్తుంది మనకు. ఖరదూషణాదుల వధానంతరం జనస్థానం నుంచి అకంపనుడనే దూత లంకకు వెళ్లి మొదటిసారిగా చెబుతాడు

Page 60

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు