ఎన్నో విషయాలున్నాయి మనం తెలుసుకోవలసినవి. వాటిని మహర్షి అక్కడ బయటపెట్టలేదు గుంభనగా దాచి ఉంచాడు. రాముడు మానవుడుగానే జన్మించటం అందులో దశరథుడికే జన్మించాలనుకోవటం ఒక గుంభన. అలాగే శివధనుస్సు విరిచి ఆయన సీతనే వివాహం చేసుకోవటంలో కూడా మర్మముంది. అంతేగాదు. ఆవిడను రావణుడెత్తుకుపోయిన తరువాత కిష్కింధకు వెళ్లటమూ అక్కడ సుగ్రీవాది వానరులతోనే సఖ్యం చేయటంలోకూడా ఆంతర్యముంది. ఇవన్నీ మనకు ఉత్తరకాండలోనే బయటపడతాయి.
రావణుడి జన్మ తపః పరాక్రమాదులన్నీ ఉత్తరంలోనే కదా వస్తాయి. అతడు తన తమ్ములతో పాటు బ్రహ్మను గూర్చి బ్రహ్మాండంగా తపస్సు చేసి ఆయనవల్ల వరాలు సంపాదించాడు. అందులో “సుపర్ణనాగయక్షాణామ్, దైత్యదానవ రక్షసామ్, అవధ్యోహం ప్రజాధ్యక్ష, దేవతానాంచ శాశ్వతః" అని సమస్త భూతాలవల్లా తనకు చావు లేకుండా వరం కోరుకొన్నాడు. ఆయనా దాన్ని ప్రసాదించాడు. కాని వాడి ప్రారబ్ధం కొద్దీ మనుష్యులవల్ల కోరుకో లేదు. పైగా నహిచింతా మమాన్యేషు ప్రాణిష్వమరపూజిత. తృణభూతాహి తేమన్యే- ప్రాణినో మానుషాదయః మానవుల దేమిటి. వారివల్ల నాకు భయంలేదు. తృణప్రాయ మాజాతి అంటాడు. సరే అలాగే అవుతుందిలే పొమ్మని వెళ్లిపోతాడా చతురాననుడు. చూచారా. ఇలా వాడు మానవులను తృణీకరించి వారివల్ల అవధ్యత్వం కోరుకోలేదు గనుకనే మానవుడుగానే జన్మించాలని సంకల్పించాడు పరమాత్మ. అలాగే తరువాత వరగర్వంతో వాడు విహరిస్తూ అయోధ్యాపతి - ఇక్ష్వాకువంశ్యుడూ అయిన అనరణ్యుడనే రాజుమీదికి దండెత్తి పోతాడు. ఆ రాజు ఎంతో కాలం అతనితో ధైర్యంగా పోరాడి కూడా వరప్రభావజన్యమైన అతని పరాక్రమానికి లొంగిపోతాడు. రావణుడతణ్ణి సంహరించే సమయంలో ప్రాణాలు కోల్పొతూ ఇలా అంటాడు. "ఉత్పత్స్యతే కులే హ్యస్మిన్ ఇక్ష్వాకూణామ్ మహాత్మనామ్ రామో దాశరధిర్నామ యస్తే ప్రాణాన్ హరిష్యతి.” నా ప్రాణాలు నీవు హరించినట్టుగాదు. నీ ప్రాణాలు హరించటానికి రేపు మా ఇక్ష్వాకు వంశంలోనే పుట్టబోతున్నాడొక మహానుభావుడు. దశరథుడి గర్భవాసంలో రాముడనే పేరుతో జాగ్రత్త అని హెచ్చరించి ప్రాణాలు విడుస్తాడు. కనుకనే మానవుడుగా జన్మించాలనే గాక దశరథుడికే రాముడనే పేరుతో జన్మించవలసి వచ్చింది ఆదివిష్ణువు.
Page 59