కథా సంవిధానము
రామాయణాది నామకరణమూ, తదనుగుణంగా సాగిన కథా గమనమూ, దానిలో అంతర్వాహినిగా ప్రసరించే ఆధ్యాత్మిక రహస్యమూ మనమింతదాకా చర్చిస్తూ వచ్చాము. ఇదంతా ఆ పరమాత్మ లీలావైభవమే నని కూడా సూచన చేశాము. ఆ పరతత్త్వమే నరనారాయణాత్మకం. నారాయణుడే అవతరించి నరరూపంతో సంచరించి మరలా సాధన చేసి తరించి నారాయణ పదాన్ని అందుకోవటమే కథలోని స్వారస్యమని గదా గ్రహించాము. పోతే అలాంటి ఏ లోకోత్తరమైన భగవద్విభూతిని మనకు స్ఫురింపజేయాలంటే మహర్షి తన కథా నేపధ్యాన్ని ఎలా మలచుకొంటూ వచ్చాడో పూర్వాపరాలనెలా కలుపుకొంటూ వచ్చాడో ఏయే సన్నివేశాలనెలా భావించాడో నిర్మించాడో పరిశీలించి చూడటం మనకెంతైనా లాభదాయకం. అదే సంవిధానమంటే. మహర్షి కథలో పొదిగిన భగవద్విభూతి ఎంత ఉదాత్తమో దానిని ధ్వనింపజేసే కథాసంవిధానమంత గంభీరమైనది. అత్యద్భుతమైనది. ఈ అద్భుత దర్పణంలో తొంగి చూడగలిగితే చాలు. కవి వివక్షితమైన ఆ తాత్త్విక విభూతి విశ్వరూపాన్ని ధరించి సాక్షాత్కరిస్తుంది మన మనోనేత్రాలకు.
మహర్షి భావనా శిఖరాల నుంచి జాలువారిన రామకథా వాహిని రెండు ప్రధానశాఖలయి ప్రవహించింది. ఒకటి పూర్వ రామాయణం. మరొకటి ఉత్తర రామాయణం. ఇలా పూర్వోత్తరాలుగా విభజించటమనేది ఏదో యాదృచ్ఛికంగా జరిగింది కాదు. ఎంతో ఆలోచనతో చేశాడు మహర్షి. కథా రహస్యాలెన్నో ఇమిడి ఉన్నాయిందులో. మామూలుగా మనం పూర్వం జరిగిన విషయమేదో అది పూర్వ రామాయణంలో ఉంటుందనీ అనంతరం జరిగినదేదో అది ఉత్తర రామాయణంలో ఉంటుందనీ భావిస్తాము. అలా కాదిక్కడ వ్యవహారం. మన భావనకు భిన్నంగా ఇక్కడ పూర్వం జరిగిన కథావస్తు వుత్తరంలో, ఉత్తరంలో జరిగిన కథ పూర్వంలోనూ నిబంధించాడు వాల్మీకి. అసలు ప్రధానపాత్రలైన సీతా రామ రావణులు ముగ్గురూ ఎవరో వారి పూర్వ వృత్తాంతమేమిటో పూర్వ రామాయణంలో లేదు. అది ఉత్తర రామాయణంలోనే వస్తుంది. పోతే వారి అనంతర వృత్తాంతమే మనకు పూర్వ
Page 57