రాముడికోసం అయనమనీ చెప్పవచ్చునని గదా చెప్పాము. రాముడికోసం అయన మన్నప్పుడది జీవపరంగా. రాముడే అయన మన్నప్పుడది ఈశ్వరపరంగా. వేదాంతంలో జీవేశ్వరులకు భేదం లేదని గదా సిద్ధాంతం. అందుచేత కథను ఎలా వ్యాఖ్యానించినా వ్యాఖ్యానించవచ్చు. అందులో జీవపరంగా అయితే సంసారోత్తరణం. ఈశ్వరపరంగా సంసారావతరణం. దృష్టికోణంలో తేడాయేగాని రెండూ ఒకటే. ఈశ్వరుడీ లోకంలో జీవరూపంగా అవతరించి మరలా సాధన చేసి ఈశ్వర రూపంగా ఉత్తీర్ణుడవుతాడనే పరమసత్యాన్ని చాటటమే అసలున్న మాట. అదే సత్యదర్శి అయిన వాల్మీకి మహర్షి తన కావ్యవస్తువుద్వారా అన్నమాట. రాముడు అవతరించి సీతను చేపట్టి భౌతికమైన ప్రకృతి గుణాల ప్రభావానికి లోబడటం లేదా లోబడినట్టు నటించటం వరకూ ఆత్మారాముడి అవతరణమైతే పౌలస్త్యవధ చేసి తదీయ నిర్బంధం నుంచి సీతాచరితాన్ని సంరక్షించి మరలా తనధామంవైపు పయనించటం దశరథ రాముడి ఉత్తరణం. ఈ నరనారాయణ భూమికలు రెండూ ఆ పరమాత్మలీలే. దానిని అడుగడుగునా ధ్వనింపజేయటమే ఈ కథా నిర్మాణంలోని ఆంతర్యం. ఈ త్రివిధ నామకరణంలోని మాధుర్యం.
Page 56