స్థానంలో దివ్యమైన సహజమైన ఏ యోగమాయ ఉందో అదే పరమాత్మ నాశ్రయించింది. “పరాస్య శక్తిర్వివిధైవ శ్రూయతే స్వాభావికీ” అని గదా శాస్త్రం. స్వాభావికమైన శక్తి ఎక్కడికీ పోదది. ఎప్పుడూ ఉంటుంది ఆత్మకు అది నిత్యానపాయిని. సీత లక్ష్మీస్వరూపిణి అయి వైకుంఠం అంటే అచ్యుతమైన పరమపదం ప్రవేశించింది. మరి రాముడో ఆత్మారాముడే గదా. అయినా ఇన్నాళ్లూ దశరథ రాముడయి కనిపించాడు. జీవభావాన్ని అభినయించాడు. ఆ జీవభావాన్ని కూడా తొలగించుకోవాలిపుడు. అదే సీతా పరిత్యాగం తరువాత లక్ష్మణపరిత్యాగం. పోతే ఇక తాను స్వాభావికమైన తన శక్తిని విడిచి ఏకాకిగా ఉండలేడు. వెంటనే సరయూనదిలో ప్రవేశించి భౌతికమైన ఈ ఉపాధిని భూతములకే ప్రత్యర్పణం చేసి అశరీరుడయి తన ధామాన్ని చేరాడు. అశరీరమే మోక్షం. శరీరం పాంచభౌతికం. పంచభూతాలలో జలమనేది మిగతా నాలుగింటికీ ఉపలక్షణం. నారములంటే జలం. అంటే పంచభూతాలే. నారాయణుడంటే ఆ భూతాలకన్నింటికీ గమ్యం. గమ్యం గమ్యంగానే ఉండాలి. అది గమకం కాగూడదు. గమకమైతే నారాయణుడు నరుడవుతాడు. అయ్యాడు ప్రస్తుతం. అయితే అది తన సంకల్పంచేతనే కాబట్టి ఆ ఉపాధులకు తాను పరవశుడయినట్టుగా అభినయిస్తూ జన్మించాడు. అభినయిస్తూనే జీవించాడు. మరలా ఇప్పుడలా అభినయిస్తూనే ఆ భూతాలను భూతాలకే అర్పణచేసి తాను అభౌతికమైన తన స్వరూపాన్నే పొందాడు. నరుడు మరలా నారాయణుడయి ప్రకాశించాడు. రాముడు సరయూ జలానికి తన శరీరమర్పణ చేయటం పంచభూతాలలో తన భౌతికమైన నరత్వాన్ని ప్రవిలాపన చేయటమే. అదృశ్యుడయి వైకుంఠం చేరటం గుణాతీతమైన తన స్వరూపంతో మరలా తాను భాసించటమే. శరీరంతో రాముడు నిర్గమించాడని రామాయణంలో చెప్పిన మాట ఈ భౌతిక శరీరంతోనని గాదు. సహజమైన చైతన్య శరీరంతోనని ఊహించాలి మనం.
ఈవిధంగా పూర్వాపరాలు చక్కగా లోతుకు దిగి పరామర్శించి చూస్తే రామాయణ కథ అంతా ఒక ఆధ్యాత్మికమైన ప్రణాళిక మీదనే సాగించినట్టు కనిపిస్తుంది మహర్షి. ఆ ప్రణాళికకు బాహ్యమైన ఒక కవచమే కథా ప్రక్రియ అంతా. ఇలాంటి ఆదర్శాన్ని బయటపెట్టాలనే త్రివిధమైన నామకరణం కూడా చేశాడు తన కావ్యానికి. రామాయణమంటే రాముడే అయనమనీ చెప్పవచ్చు.
Page 55