#


Index

కావ్యసంకేతము

రామలక్ష్మణులు వానర బలాన్ని సమకూర్చుకోవటం. సుగ్రీవ హనుమదాది వానరులెవరోగారు. సూర్యవాయ్వగ్న్యాదులైన ఆయా దేవతలే రామకార్యార్ధమై ఋక్ష వానరాచ్ఛ భల్లాది రూపాలలో అవతరించారు. కాబట్టి వారంతా దేవతలే. అందుచేత రాముడు వారితో సఖ్యం చేశాడన్నా వారి బలంతో రాక్షసులమీద దండెత్తాడన్నా అది దైవబలాన్ని తోడు చేసుకొని అసురశక్తులతో పోరాడటమే. దైవసంపదతోనే ఈ సంసారాన్ని దాటగలడు మానవుడు. అదే సముద్ర తరణం. అందుకు గురూపదేశంకూడా తోడుకావాలి. హనుమత్సందేశమదే. దానితో అతిగంభీరమూ అతిభయానకమూ అయినా మార్గమిస్తుంది ఈ సంసార సాగరం. అలాగే ఇచ్చింది రాముడికి. మరి అంతవరకే గాదు దైవబలం. అది సంసారక్లేశాన్ని దాటవేయటమే గాక అసుర బలంతో పోరాడి మన శక్తిని వాటి బారినుంచి విడిపించి మనకు హస్తగతం చేస్తుంది. రావణాదులను వధించి తదీయ బంధంనుంచి జానకికి విమోచనం కల్పించటం ఆవిడతో కలిసి విమానారూఢుడై రాముడయోధ్యకు బయలుదేరటంలో ఆంతర్యమిదే. పుష్పకం దేవతా జ్ఞానం లాంటిది. అందులో వానరులంతా చేరటం దైవగుణసంపత్తి. వారితో కలిసి ఉత్తరంగా పయనించటం ఉత్తరాయణమైన అర్చిరాది మార్గం. దేవయానం. సీతాసమేతుడై అయోధ్యను ప్రవేశించటం పట్టాభిషేక మహోత్సవాన్ని అనుభవించటం సాధకుడు ప్రణష్టమైన తన ఆత్మశక్తిని మరలా సంపాదించి స్వమహిమ యందు ప్రతిష్ఠితుడు కావటమే. మరేదీ గాదు. అదికూడా పార్ధివమే గనుక ఆ శక్తి పరిశుద్ధ కావలసి ఉంది. దానికి జ్ఞానమే శరణ్యం. జ్ఞానాగ్నిలో బడి పరిశుద్ధ అయితేనే రజస్తమో మాలిన్యంపోయి అది శుద్ధ సత్త్వంతో ప్రకాశిస్తుంది. అందుకే లంకలో సీత అగ్ని ప్రవేశంచేసి తన పాతివ్రత్యాన్ని నిరూపించుకొన్న తరువాతనే రాముడితో అయోధ్య ప్రవేశించగలిగింది. ఆయనతో పట్టాభిషేకానికి నోచుకోగలిగింది.

  అయితే శుద్ధ సత్త్వమైనా అదీ ఒక గుణమే. గుణాలన్నీ ప్రకృతి సంబంధులే. దానితో సాంగత్యమున్నంత వరకూ మరలా సంసార ప్రవేశం తప్పదు పరమాత్మకు. అందుచేత దాన్నికూడా విసర్జించి గుణాతీతుడయి మెలగాలి తాను. దానికి సూచకమే ఉత్తరకాండలో సీతాపరిత్యాగం. పరిత్యజిస్తే చివరకావిడ భూమిలో ప్రవేశించి మరలా కనపడకుండా పోతుంది. అంటే పార్ధివమైన పృథివికే అంకితమయి పోయి దాని

Page 54

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు