#


Index

కావ్యసంకేతము

నేపధ్యంలో అభినయిస్తున్నాడు గదా ప్రస్తుతం. వదిలితే ఎలాగ. వదలకుండానే గురువుగారి వెంట మిధిలలో ప్రవేశించాడు. ధనుర్భంగం చేశాడు. ధనుర్భంగమంటే సమాధి భంగమే. దానితో నిత్యా ప్రచలిత చైతన్యరూపుడననే భావానికి స్వస్తి చెప్పినట్టయింది. తత్ఫలితమే సీతాకర గ్రహణం. లక్ష్మీగ్రహణం కాదిది. సీతాగ్రహణం. లక్ష్మి తన లక్ష్యమే కాబట్టి అక్కడ చ్యుతిలేదు. సీత ఆ లక్ష్మికి రూపాంతరం. అది దివ్యమైతే ఇది భౌమం. భూజాత గదా సీత. కనుక భౌమం. భౌమం గనుకనే తత్పరి గ్రహం పరమాత్మ కచ్యుతమైన స్థానం నుంచి చ్యుతి కల్పించింది. అప్పటికీ శివధనుర్భంగం చేసి తమస్సునూ పరశురామ గర్వభంగం చేసి రజస్సునూ జయించి తన సత్త్వాన్ని కాపాడుకొంటూ వచ్చాడాయన. పరశురాముడాయనకు వైష్ణవధనుస్సు స్వాధీనంచేసి పోవట మీసత్త్వరక్షణమే. శివధనుస్సును భగ్నం చేసినట్టు దానిని భగ్నం చేయలేదు. ఊరక దగ్గరపెట్టుకొన్నాడు. సత్త్వసంరక్షణకు నిదర్శనమది. సత్త్వగుణం తనదే గదా. అయితే ఎంత సత్త్వగుణ సంపన్నుడైనా పార్ధివమైన మాయాశక్తిని దగ్గర ఉంచుకొన్నంతవరకూ ప్రయోజనం లేదు. అది పరిపూర్ణతకు దూరం చేసి పరిచ్ఛిన్నతకే దారి తీస్తుంది. అలాటి పరిచ్ఛిన్న పార్ధివమాయాశక్తిని వదలకుండా అయోధ్యలో నివసిద్దామంటే కుదరదు. అది అక్కడ కుదురుగా ఉండనీయదు. దూరం చేస్తుంది. కనుకనే పట్టాభిషేకాని కెవరెంత ప్రయత్నించినా అంతదాకా తన్ను ప్రేమిస్తూ వచ్చిన తల్లే తనదారి కడ్డుతగిలింది. దండకారణ్యం దాకా తరిమి కొట్టింది.

  సీతా లక్ష్మణులతో బయలుదేరి వెళ్లాడు అరణ్యానికి. లక్ష్మణుడంటే జీవభావం. సీత అవిద్యారూపిణి అయిన మాయ. అవిద్య ప్రక్కనుందంటే జీవభావం కూడా ప్రక్కనున్నట్టే. కనుకనే వారిరువురితో పాటూ అరణ్యగమనం. అరణ్యమంటే సంసారమే. అయోధ్యకాదిది అరణ్యం. అచ్యుతమైన స్థానమయోధ్య అయితే అందులోంచి చ్యుతిపొంది పడ్డ దరణ్యం. అయితే ఇందులో అసుర సంపదా ఉంది. దైవ సంపదా ఉంది. వివేకవంతుడైతే దైవసంపద నాశ్రయించి తద్భలంతో అసుర శక్తులను అణగద్రొక్కవచ్చు. అలాగే చేశాడు రాముడు. సుతీక్షశరభంగ అగస్త్యాది మహర్షుల దివ్యతపశ్శక్తుల అనుగ్రహాన్ని అస్త్రశస్త్రాదుల రూపంలో సాధించి ఖరదూషణాదులైన రాక్షస బలాలను అన్నింటినీ రూపుమాపాడు. అయితే ఎంతరూపు

Page 52

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు