#


Index

కావ్యసంకేతము

  మొత్తానికి భగవత్తత్త్వమిలా చతుర్ధా ఎప్పుడు విభక్తమయి అవతరించిందో అప్పుడే అది వ్యష్టిరూపంగా పరిచ్ఛిన్నమైన జీవతత్త్వంలాగే వ్యవహరించ సాగింది. వ్యవహరిస్తున్నా వ్యవహరిస్తున్నాననే స్వరూపజ్ఞానం కోలుపోలేదు మరలా. కోలుపోతే అది భగవత్తత్త్వమే కాదు. దీనికి సూచకమే మిగతా లక్ష్మణాదులైన సోదరులు ముగ్గురూ ఆయన నాశ్రయించుకొని ఆయన చెప్పుచేతలలో మెలగటం. అంటే ఏమని భావం. అన్ని గుణాలూ కలిసి సత్త్వగుణానికే అంకితమయినాయి. వాటిని తనలో లయం చేసుకొన్న సత్త్వమిక విశుద్ధసత్త్వమే. మరి విశుద్ధ సత్త్వోపాధి గదా ఈశ్వరుడంటే. ఆయన మలిన సత్త్వోపాధి అయిన జీవుడెలా అవుతాడు. అయినట్టు నటిస్తున్నాడంత మాత్రమే. ఈ నటనే తరువాత రామాయణకథా గమనమంతా. కాకపక్షధరుడయి ఉన్న కాలంలోనే మహర్షి విశ్వామిత్రుడు రావటమూ దశరథుడు పంపటానికి వెనుదీసినా సరకు చేయక తనవెంట గొనిపోవటమూ దారిలో అనేక విద్యలుపదేశించటమూ తాటకాదులను వధింపజేయటమూ చివరకు శివధనుర్భంగానికి పురికొలిపి సీతాకళ్యాణాన్ని గావించి పోవటమూ ఇదంతా ఏమిటీ వ్యవహారం “ఆచార్యవాన్ పురుషోవేద” అన్నట్టు గురు శుశ్రూషా తద్వారా సకల విద్యాప్రాప్తి. విద్య అంటే ఐహికమూ కావచ్చు. ఆముష్మికమూ కావచ్చు. ప్రపేదిరే ప్రాక్తన జన్మ విద్యా అన్నట్టు పరమాత్మ క్రొత్తగా ఒక గురువు వల్ల అభ్యసించటమేమిటి. అది ఒక నిమిత్తం. తన్మూలంగా తన విద్యలను తానే మరలా జ్ఞాపకం చేసుకొంటున్నా డాయన. తద్విద్యాబలంతోనే సిద్ధాశ్రమ మార్గంలో ఎదురైన తాటకను మట్టుపెట్టాడు. అవిద్యా రూపిణే తాటక అంటే. అది సిద్ధి మార్గానికాటంకం. దాన్నిజయిస్తే సిద్ధి. పోతే దాని పుత్రులు మారీచసుబాహులు. అవి ఏవోకావు. కామమొకటి కర్మమొకటి. అవిద్య కడుపున బుట్టిన బిడ్డలే అవి. అందులో కర్మ సుబాహుడైతే కామం మారీచుడు. సుబాహుణ్ణి వధించాడు రాముడు. కాని మారీచుణ్ణి అలా వధించలేదు. దూరంగా వదలివేశాడు. వాడు దండకలో పోయిపడ్డాడు. కనిపెట్టుకొని ఉన్నాడు స్వామిరాకకోసం. అంటే కామాన్ని పూర్తిగా నిర్మూలించలేదు. కాబట్టి అది ఎప్పటికైనా మోసం తెస్తుందని భావం. అలాగే తెచ్చిందిగదా మాయలేడి రూపంలో చివరకు.

  ఇది భావికథా ప్రవృత్తికంతటికీ నిమిత్తం. కామాన్ని వదలలేదు పరమాత్మ. అది వదిలితే జీవాత్మరూపంగా అవతరించటమనేదే పొసగదు. మరి జీవుడి

Page 51

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు