#


Index

కావ్యసంకేతము

ఆయావ్యష్టి శరీరాలలో ప్రవేశించాలి ఆ పరమాత్మ. అలాగే ప్రవేశించాడు కౌసల్యాదులైన పట్టమహిషుల శరీరాలలో. అందులో కూడా ముగ్గురు రాణులలో నలుగురుగా అవతరించాడు. ఏమిటి క్రమం. ముగ్గురంటే ఇక్కడ మూడు గుణాలు. సత్త్వరజస్తమస్సులనే ప్రకృతిగుణాలు. కౌసల్య సత్త్వం. సుమిత్ర రజస్సు. కైక తమస్సు. ఇది చూడటానికి మూడైనా అన్యోన్య సంసర్గంతో నాలుగవుతాయి. సత్త్వం ప్రధానమై రజస్సు ఉపసర్జనమైతే అది ఒకటి. రజస్సు ప్రధానమై సత్త్వం అప్రధానమైతే మరొకటి. రజస్సు ప్రధానమై తమస్సు గుణభూతమైతే ఇంకొకటి. మరి తమస్సే ప్రధానమై దానికి రజస్సంగమైతే వేరొకటి. ఇలా త్రిగుణాలే ప్రధాన గుణభావాన్ని బట్టి చాతుర్గుణ్యాన్ని భజిస్తున్నాయి.

  త్రిగుణాలకు సంకేతాలని గదా వర్ణించాము కౌసల్యాదులను. పోతే వారికి రామాదులు నలుగురు పుత్రులు జన్మించారని చెప్పటం ఈ చతుర్గుణాలకు చిహ్నంగా చెప్పినమాటే. ఒకే ఒక పరమాత్మ నాలుగు కళలుగా విభక్తమై రామలక్ష్మణ భరత శత్రుఘ్నులనే పేర్లతో ఆవిర్భవించాడు. అందులో రాముడు సత్త్వగుణ ప్రధానుడు. లక్ష్మణ భరతులు రజోగుణ ప్రధానులు. శత్రఘ్నుడు తమః ప్రధానుడు. రజోగుణ ప్రధానులైన భరత లక్ష్మణులలో ఒకతేడా ఉన్నది. లక్ష్మణుడికి సత్త్వస్పర్శ ఉంది. భరతుడికదిలేదు. దానికి మారు తమఃస్పర్శ ఉందతనికి. అందుకే రామలక్ష్మణులొక జట్టయితే భరత శత్రఘ్ను లొకజత అయినారు. నిజానికి లక్ష్మణుడికి జత శత్రుఘ్నుడు కావలసింది. సుమిత్రా కుమారులేకదా వారిద్దరూ. అయినా అలా జరగలేదు. కారణం, ముందు పేర్కొన్న నాలుగు గుణజాతులలో రామలక్ష్మణులకు సత్త్వస్పర్శ ఉంది. తమ స్మృర్శ బొత్తిగాలేదు. కాగా భరత శత్రుఘ్నులకు తమఃస్పర్శకద్దు. సత్త్వస్పర్శ బొత్తిగాలేదు. అందుచేత ఇలా గుణసాహిత్యాన్ని పురస్కరించుకొని వారిద్దరూ ఒక పక్షమైతే వీరిద్దరూ ఒక పక్షమై కనిపిస్తారు కథలో. అంతేకాదు. మరొక రహస్యమేమంటే సుమిత్ర రజోగుణ ప్రతీక అని గదా చెప్పాము. రజస్సు సత్త్వ తమస్సులకు రెంటికీ మధ్యవర్తి. మధ్యవర్తి అయి ఆ రెండింటితోనూ మరలా సంబంధం పెట్టుకొని ఉంటుంది. చాతుర్గుణ్యంగా విభక్తమయినప్పుడు కూడా అన్నింటిలోనూ రజస్సనేది అను వృత్తమవుతూ ఉండటమే మనకుదాఖలా. ఇలా రెండింటితోనూ మైత్రి కలిగి ఉండటం మూలాన్నే సుమిత్ర అనే పేరు సార్ధకంగా పెట్టి ఉంటాడు మహాకవి.

Page 50

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు