#


Index

కావ్యసంకేతము

ఉత్తీర్ణత అని కూడ సూచించటమే బాలనుంచి ఉత్తరవరకూ ఆయా కాండాలకు నామకరణం చేయటంలో కూడా అంతరార్ధం.

  అయితే ఇది దేవుడి కథ గదా మనబోటి జీవుల కథ ఎలా అవుతుందని శంకించవచ్చు. ఇలాంటి ఆశంకతో పనిలేదు. ఎందుకంటే వేదాంతశాస్త్రం జీవుడే దేవుడని చాటుతున్నది. "కల్పయత్యాత్మనాత్మాన మాత్మాదేవః స్వమాయయా” ఆ దేవుడే స్వకీయమైన యోగమాయా ప్రభావంతో తన్ను తానే జీవుడుగా మలుచుకొని ఏమీ తెలియనివాడి మాదిరి ఈ ప్రపంచంలో నటిస్తున్నాడు. మరలా దీని నుంచి బయటపడాలని తానే ప్రయత్నిస్తున్నాడు. అదే రాముడికథ. ఆత్మారాముడే రాముడు. ఆయనగారు మొదట వికుంఠంలోనే కాపురముండేవాడు. కుంఠంగానిదేదో అది వికుంఠం. అలాటి నిర్గుణ నిరుపాధికమైన పరతత్త్వానికున్నట్టుండి ఒక సంకల్పం కలిగింది. కలిగినా అది మనబోటి జీవులకు కలిగే సంకల్పంలాగా ప్రాకృతమైనది కాదు. అప్రాకృతమైనది. కాబట్టి దానికి సత్యసంకల్పమని పేరు. సత్యం గనుకనే వికుంఠాన్ని ఎడబాసినా సరాసరి వచ్చి అయోధ్యలోనే వాలగలిగాడు. యోధ్యగానిదేదో అది గదా అయోధ్య. అంటే వికుంఠానికి నామాంతరమే. మరితానో. రాముడనే పేరుతో జన్మించినా ఆత్మారాముడికి రూపాంతరమే అది. అసలది జన్మ అయితే గదా. అవతారమాయె. మాయకువశమై వస్తే అది జన్మ. మాయను వశంచేసుకొని వస్తే అది అవతారం. వశుడయి వచ్చేవాడు జీవుడు. వశంచేసుకొని వచ్చేవాడు దేవుడు. అలాటి దేవుడే జీవుడయినాడిప్పుడు. "వేదవేద్యేపరే పుంసి జాతే దశరథాత్మజే” ఆత్మారాముడే దశరథ రాముడయినాడు. కాలేదు వాస్తవంలో. అయినట్టు భావిస్తున్నాడు. “సంభవా మ్యాత్మమాయయా” అన్నట్టు అజుడూ అవ్యయుడూ అయికూడా తనయోగమాయా ప్రభావంచేత జనించినట్టు చేసినట్టు అభినయించాడు. అది కేవలం తన సంకల్పమాత్రంచేతనే జరిగిన వ్యవహారం.

  అయితే మాయామయమైన వ్యవహారంలో కూడా ఒక క్రమముందన్నారు భగవత్పాదులు. ఆ క్రమాన్ని ఛాందోగ్యమిలా వర్ణించింది. "స ఐక్షత బహుస్యామ్ ప్రజాయే యేతి. సతేజో ఽసృజత. తత్తేజ ఐక్షత. ఆపో ఽసృజత. తా ఆప ఐక్షంత అన్న ఽమసృజంత” ఇలా తేజో బన్నాత్మకంగా జరిగిందీ సృష్టి. త్రివృత్కృతమైన ఈ మూడింటి మూలంగా అటు బాహ్యశరీరమూ ఇటు అభ్యంతరమైన ఈ పిండ

Page 48

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు