చేస్తే మన బుద్ధులను అసుర గుణాలకు దూరం చేసి దైవగుణాలతో సువాసితం చేయటమే మహాకవి అభిమతం అని చెప్పక చెబుతున్నది.
దైవభావనే మానవుడికి జన్మతారకం. అయితే అది ఒక్కసారిగా వచ్చి మన
ఒళ్లోపడేది గాదు. బహుజన్మలు గడచిపోయాయి మనమది పోగొట్టుకొని. తిరిగీ
దాన్ని రాబట్టుకోవాలంటే క్రమంగా సాగిస్తూ పోవాలి మన ప్రయాణం.
ఆప్రయాణమేదోకాదు. తదాకారమైన చిత్తవృత్తిని పెంచుకొంటూ పోవటమే. అలా
పెంచుతూ పోతే అది అంతకంతకు పెరిగి పెద్దదయి అసుర వృత్తులనన్నిటినీ
నిర్మూలించి చివరకా బ్రహ్మపధంలో కూచుని పట్టాభిషేకం చేసుకొంటుంది.
“యేషాంవృత్తి స్సమావృద్ధాపరిపక్వాచ సాపునః" ఎవరికలా వృత్తి సమమై వృద్ధమై
పరిపక్వమవుతుందో వారే ధన్యులూ త్రిభువన వంద్యులూ నన్నారు భగవత్పాదులు.
భగవానుడైన వాల్మీకి సరిగా ఈ భావాన్ని మనకు చాటటానికే బాలనుంచి ఉత్తర
వరకూ కాండ విభాగం చేసి చూపాడు. ఈశ్వర భావన మానవుడికి మొదట మొదట
స్వల్పమైన మోతాదులో ఆరంభమవుతుంది. అప్పుడది బాల. బాల అంటే స్వల్పమనే
అర్ధం. అది క్రమంగా పెరిగి అయోధ్య అవుతుంది. యోధ్యమంటే యుద్ధం చేసి
గెలవగలిగింది. అలా గెలవటానికి సాధ్యం కానిదేదో అది అయోధ్య. అంటే అసుర
శక్తుల మధ్యనే సంచరించినా దానికి భయంలేదు. అలాగే వానర నివాసమైన
కిష్కింధలో నివసించినా ప్రమాదంలేదు. వానరమంటే చపల స్వభావానికి సంకేతం.
ఎలాంటి చాపల్యమూ దానిని ప్రక్కకు లాగలేదని భావం. ఇందులో అసుర శక్తులు
ఆవరణాత్మకమైన తమోగుణానికి ప్రతీక అయితే వానర సైన్యం విక్షేపాత్మకమైన
రజోగుణానికని భావించవచ్చు. అలాగే సాగరమెదురైనా అందులో ఎన్నో
ఉపద్రవాలేర్పడినా చివరకు రాక్షసమైన తామస వృత్తులన్నీ ఒక్కుమ్మడిగా వచ్చి
పైన బడినా దహింపజేసినా చెక్కుచెదరదా వృత్తి. అన్ని విఘ్నాలనూ భేదించి
దూసుకుపోయి క్షేమంగా బయటపడగలదు. చివరకు వాటితో వీరదారుణమైన
యుద్ధమే సంభవించి అవి ఎన్ని మాయోపాయాలు ప్రయోగించి సమయింపజూచినా
సమసిపోక మీదు మిక్కిలి వాటినే తన దివ్య ప్రభావంచేత సమూలంగా నిర్మూలించి
అంతిమ విజయాన్ని సాధించి తన స్వరూప సామ్రాజ్యంలోనే తాను చివరకు మహా
వైభవంతో పట్టాభిషేకం చేసుకొంటుంది. అదే జీవుడికీ సంసార బంధం నుంచి
Page 47