మహర్షి తాను లోకానికి చాటదలచిన ఈ ఆధ్యాత్మిక తత్త్వానికి ప్రతీకగానే రామాయణ కథా ప్రణాళికను తయారుచేశాడు. ఆ ప్రణాళిక అనే త్రాటిమీదనే కథా సన్నివేశాలనన్నిటినీ ఏకధాటిగా నడుపుతూ పోయాడు. అంతర్వాహినిగా ఆధ్యాత్మ జ్ఞానం ప్రవహిస్తుంటే దానికనురూపంగా నడుస్తూ పోతుంది బాహ్యమైన కథా వస్తువంతా. అది కావ్యాత్మ అయితే ఇది కావ్యశరీరం. ఆత్మను విడిచి శరీరానికి విలువ లేనట్టే దాన్ని విడిస్తే దీనికి ధర పలకదు. రెండింటికీ ఉన్న ఈ సామరస్యాన్ని అర్ధం చేసుకోగలిగితే రామాయణంలోని రామణీయకమేమిటో మనకు హృదయంగ మవుతోంది. అసలు రామతత్త్వమే గదా మానవ బుద్ధులందుకోవలసిన జీవిత పరమార్ధమని చెప్పాము. అందుకోవాలంటే దానికి రామాకార వాసితమైన బుద్ధి వృత్తి కావాలి గాని రావణాకార వాసితమైనది పనికిరాదు. రావణవాసితమైతే అది మనలనంతకంతకీ సంసారం వైపే లాగుతుంటుంది. సంసార వాగుర నుంచి నిష్క్రమించటానికి గదా మానవుడు చేయవలసిన ప్రయత్నం. అది "తేన త్యక్తేన భుంజీథాః" అన్నట్టు దీన్ని వదులుకుంటూనే పొందవలసింది. పొందాలంటే ఈశావాస్య మిదమ్ సర్వమ్ సర్వమూ ఆ ఈశ్వర స్వరూపమే ననే భావన చేత మన బుద్ధులు వాసితం కావాలంటున్నది శాస్త్రం. ఈశ్వరభావన మనస్సును వాసించేకొద్దీ అనీశ్వరమైన భావన మరుగున పడిపోతుంది. అదే ముక్తి సౌధానికి సోపానం.
దీని కనుగుణంగానే రామాయణ రచనా ప్రణాళిక సాగింది. మొదట రావణుడే జన్మించినా ఆ వృత్తాంతాన్ని వర్ణించక రామజననంతోనే కథ నడిపాడు వాల్మీకి. రామాయణంలో మొత్తం ఏడు కాండల కథ అయితే అందులో ఆరు కాండల వరకూ రామకథే. ఏ కొంచెమో అక్కడక్కడ రావణ కథ ప్రస్తావన. ప్రధానమైన ఘట్టాలన్నీ రాముడి చుట్టే తిరుగుతుంటాయి. రాముడే కేంద్రమన్నింటికీ. పోతే ఏడవదైన ఉత్తరకాండలోనే రావణుడి వృత్తాంతం వస్తుంది. అందులోనూ చివరకు మరలా రామకథే వస్తుంది. రామకథతోనే ముగుస్తుంది. ఈవిధంగా రామకథనే మొదటి ఆరు కాండలలో ప్రతిపాదించి ఎక్కడో చివర ఏడవకాండలో రావణుడి వృత్తాంతాన్ని ప్రస్తావించటం. ఆది మధ్యాంతాలలో దీనికే పట్టం కట్టి దానినెక్కడో మధ్యలో చెప్పి అక్కడకక్కడే సమాప్తం చేయటం, అది కూడా రాముడి ప్రతిష్ఠా పరాక్రమాలను ధ్వనింపచేసే ఉద్దేశంతోనే చాటటం. ఇదంతా నిశితంగా భావన
Page 46