మనేమాటకు గమనమనే గాక గమ్యమని కూడా అర్ధమే. “నాన్యః పంథా అయనాయ విద్యతే" అన్నది వేదం. అయనమంటే అక్కడ చేరవలసిన స్థానం. దాన్ని చేర్చేది పంథా అనే మాట. పరాయణమని కూడా వ్యవహరిస్తుంటాము మనం. పరమమైన గమ్యమేదో అది పరాయణం. దీనిని బట్టి రామాయణమంటే రాముడే గమ్యం. ఆత్మతత్త్వమే ఎప్పటికైనా మనం చేరవలసిన స్థానమని అర్ధం.
ఎవరా చేరవలసింది. సీత. సీత అంటే మానవుడి బుద్ధి అని చెప్పాము. ఈ బుద్ధి ఏదో గాదు. శుద్ధమైన ఆ చైతన్యరూపమే. అయితే ఆ రూపంలోనే ఉండక చరించింది. చలించటమన్నా చరించటమన్నా ఒక్కటే. రలయోరభేదః. చరించటం వల్లనే దీనికొక చరిత్ర ఏర్పడింది. అదే ఈ భౌతికమైన జీవితం మానవుడికి. ఇది ఆ మూలతత్త్వానికి వీణ్ణి బాగా దూరం చేసింది. సంసార బంధంలో పడదోసింది. తన్మూలంగా అసుర శక్తులు వీణ్ణి చుట్టుముట్టాయి. చంపుతాము చేస్తామని నిత్యమూ వీణ్ణి బెదిరిస్తుంటాయి. బాధిస్తుంటాయి. ఇది ఒక విషవలయం. ఒక జీవన్మరణ సమస్య. ఈ సంసారమనే సాగరంలో దీని నడుమ ఎక్కడో ఉన్న ఒక దేహమనే ద్వీపంలో అసుర శక్తులనే పరివారం మధ్య చిక్కి నిజంలో అశోకమే అయినా అశోకమనే భావన కోలుపోయి శోకభావనతో కాలం గడపవలసి వస్తున్నది.
ఇలాటి శోకసాగరం నుంచి మరలా బయటపడి మన ఆత్మ సామ్రాజ్యాన్ని మనం సంపాదించాలంటే ఏమిటి మన కుపాయం. ఈ అసుర భాషణలు వినక వీటి బెదిరింపులను చెవిన బెట్టక వీటికి విముఖులమై విరక్తులమై నిరంతర బ్రహ్మ భావన నలవరచుకోవాలి. ఆ బ్రహ్మ స్వరూపాన్ని దర్శించి వచ్చిన హనుమంతుని లాంటి ఆచార్య పురుషుల ఉపదేశామృతాన్ని తనివిదీర ఆస్వాదించాలి. అప్పుడా భావనా బలమే మనలోని పరిచ్ఛిన్నా హంకార రూపమైన ఈ జీవభావాన్ని సంహరించి మనకు మరలా పరిపూర్ణమైన బ్రహ్మభావాన్ని ప్రసాదిస్తుంది. పౌలస్త్య వథ అంటే ఈ అహంకార నిర్మూలనమే. తద్వారా మానవుడి బుద్ధి అనే ఈ సీత ఆత్మ స్వరూపుడైన రాముడనే గమ్యంవైపు మరలా పయనిస్తుంది. అదే జీవితపరమావధి మానవుడికి. ఇదుగో ఇలా మూడింటినీ సమన్వయించి చూడగలిగితే మూడూ కలిసి మన మానవ జీవితానికొకే మహోపదేశ మందిస్తాయి. అలా అందించే మహోద్దేశంతోనే తన ఇతిహాసానికి మహర్షి ఇలా మూడు విధాలుగా నామకరణ చేశాడని భావించాలి మనం.
Page 45