వర్తిస్తున్నాడు కాబట్టి దశమముఖుడు కూడా వీడే. వీడిలో దైవసంపదా అసురసంపదా అనే రెండు లక్షణాలు ఉన్నాయి. అదే రావణుణ్ణి బ్రహ్మవంశోద్భవుడనీ రాక్షసుడనీ రెండు విధాలా వర్ణించటంలో ఆంతర్యం. కానీ బ్రహ్మలక్షణాలు మరుగునపడి రాక్షస లక్షణాలే పైకి వచ్చాయి వాడికి. అలాగే ఈ జీవుడికి అసురసంపద అయిన దంభదర్పమాన క్రోధనృశంసాది లక్షణాలే జీవితంలో తాండవిస్తాయి. అవి విడవకుండానే తపస్సు చేసి క్షుద్రమైన శక్తులు కొన్ని సాధించి ఈ సృష్టిమీదనే ఆధిపత్యం సాధించాలని చూస్తాడు మానవుడు. నేనే పరమేశ్వరుణ్ణని భావిస్తాడు. కాని వీడి కలవడ్డ శక్తి కేవలం క్షుద్రశక్తి. పారమేశ్వరమైన మహాశక్తి కాదది. అది సదాచారంతో సాధించాలి గాని వామాచారంతోకాదు. కాని ఈ వామాచారంతోనే దాన్ని సాధించాలని చూస్తాడు. అదే రావణుడు సీతను బంధించటం. బలాత్కరించటం. అయినా వశపడదా శక్తి వీడికి. వశపరచుకొని ఆ పరమాత్మ సాయుజ్యాన్ని పొందే యోగ్యత లేదు వీడికి. కనీసం దానికోసం ప్రయత్నంకూడా లేదు. దానికి దూరమయ్యాడు. దానికి దూరమై దాని శక్తి నాశిస్తే ఏమిసుఖం. అది వాణ్ణి వాడి వంశాన్ని సర్వనాశనం చేస్తుంది. అంటే ఈ జీవుణ్ణి వీడి ఉపాధివర్గంతో కూడా కాలకాలుడైన ఆ పరమాత్మ కాలరూపిణి అయిన మాయాశక్తే నిర్మూలిస్తుందని భావం. సీత మూలంగా రావణుడు ధన జన మనః ప్రాణాదికమైన సర్వస్వాన్నీ కోలుపోయాడంటే ఇదే. ఇదే పౌలస్త్యవధ అని నామకరణం చేయటంలో కవిహృదయం.
ఈ విధంగా మనమీ మూడు దృష్టులు పెట్టుకొని చూడాలి ఈ మహేతిహాసాన్ని. ఈ మూడింటి కనుగుణంగానే మూడు నామకరణలు చేశాడీ ఇతిహాసానికి మహర్షి అందులో ఇంత ఆధ్యాత్మికమైన భావన ఉంది. అయితే ఇది ఒక త్రిపథగ అని గదా వర్ణించాము. త్రిపథగ అంటే అది మూడు పాయలయి ప్రవహించినా అంతా కలిసి ఒకే ఒక పవిత్రమైన గంగాతరంగిణే. అలాగే ప్రస్తుతం వాల్మీకి తన ఇతిహాసాన్ని రామాయణమనీ సీతా చరితమనీ పౌలస్త్యవధ అనీ మూడు సంజ్ఞలతో వ్యవహరించినా అందులో మూడు విధములైన ఆధ్యాత్మిక దృష్టిని ధ్వనింపజేసినా మూడూ పరస్పర విప్రకీర్ణం కావు. మూడూ కలిసి మరలా ఒకేఒక ఆధ్యాత్మిక విద్యారహస్యాన్ని మానవులకు బోధిస్తున్నాయని మనం సమన్వయించుకోవచ్చు. అది ఎలాగంటే రామ అయనం అనే రెండు మాటలతో రామాయణమేర్పడినదని పేర్కొన్నాము. అయన
Page 44