#


Index

కావ్యసంకేతము

కూడా దర్శించి అలాగే నడిపిన మహాకవి. “వధూనాటక సంఘైశ్చ” అని అయోధ్యా పట్టణంలో నాటక సంఘాలున్నాయనీ అందులో కూడా స్త్రీ పాత్రలు స్త్రీలే ధరించేవారనీ పనిగట్టుకొని ఒక మాట వర్ణించాడు. నాటకాలమీద ఎంత అభిమానమో లేకపోతే అలా ఒక మహర్షి అయినవాడు చెప్పబనిలేదు. అసలు మహర్షులే చెప్పగలరేమో కూడా ఇలాంటి విషయాలు. లోకహిత కామనా స్వభావులే గదా ఋషులంటే. శ్రవ్యంకంటే దృశ్యమైన విధానమా పని చాలా శక్తిమంతంగా చేయగలదని వారికి తెలుసు. అందుకేనేమో ఆనందవర్ధనులు "వినేయ జన హితార్థమేవ నాటకాది గోష్ఠిలోకే మునిభిరవతారితా” అని మహామునులే నాటకాలకు నాందీ పలికారని వ్రాస్తాడు. కాళిదాసు కూడా దేవతలకు కూడా ఇది ఒక చాక్షుషమైన మహా యజ్ఞమని అభివర్ణించాడు. దేవతలకే అయినప్పుడిక మహర్షులకు కావటంలో అభ్యంతరమేముంది. కావ్యార్ధ సూచన దృశ్యంలోలాగా శ్రవ్యంలోకూడా ఆవశ్యకమే. దాని ఆవశ్యకతను గుర్తించే చేశాడీ త్రివిధమైన నామకరణమూ వాల్మీకి.

  రామాయణం సీతా చరిత్ర పౌలస్త్య వధ. రామాయణ కథ మొదట రామజననంతో ఆరంభమయింది. మధ్యలో సీతను వివాహం చేసుకొన్నాడాయన. తరువాత ఆయన అరణ్యంలో నివసిస్తుండగా పౌలస్త్యుడు ప్రవేశించాడు వారి జీవితంలో. సీత నపహరించి అతడు లంక కెత్తుకుపోగా అది తెలిసి రాముడతణ్ణి వధించి మరలా ఆవిడను పొందగలిగాడు. అయనం, చరిత్ర, వధ అని ముక్త సరిగా చెప్పిన మాటలలో అంచెలంచెలుగా కథా సన్నివేశాలనన్నింటినీ మనసుకు స్ఫురింపజేస్తున్నాడు కవి. అంతేకాదు. ఇటునుంచి అటు చూచాము కథ. పోతే అటునుంచి ఇటు చూచినా చూడవచ్చు మనం. అలా చూచినా కథలో వ్యత్యాసం రాదు. అది ఒక చమత్కారం. మొదట అసలు పౌలస్త్యుడితోనే ఆరంభమవుతుంది కథ. ఎందుకంటే సీతారాములు పుట్టకముందే పుట్టాడు రావణుడు. అతడు వర గర్వంతో ఎక్కడ బడితే అక్కడ విశృంఖలంగా విహరిస్తుంటాడు. ఒకనాడలా తిరుగుతూ ఉంటే ఒక పర్వత శిఖరంమీద తపస్సు చేస్తూ వేదవతి అనే కన్య కనిపించింది. ఆవిడను బలాత్కరించబోతే అతణ్ణి శపించి యోగాగ్నిలో దగ్ధమై తరువాత సీతగా జన్మించింది. అప్పటికా వేదవతే సీత. ఆ తరువాతనే రాముడు దశరథునికి పుత్రుడగా జన్మించి కొన్నాళ్లకు సీతను వివాహమాడాడు. కాబట్టి రావణుడు. తరువాత వేదవతీ

Page 41

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు