#


Index

కావ్యసంకేతము

సీతాచరితమనీ - పౌలస్త్యవధ అనీ మరి రెండు పేర్లు కూడా ఉన్నాయి దీనికి. అవి కూడా వాల్మీకి పెట్టినపేర్లే. ఒకే గ్రంథానికి మూడు నామధేయాలు దేనికి. మూడు మూడుపాత్రలను దృష్టిలో ఉంచుకొని చేసిన నామకరణాలు. రాముడు, సీత, రావణుడు వీరు ముగ్గురే ఇతివృత్తానికంతటికీ ప్రధానపాత్రలు. ఆది నుంచీ అంతం వరకూ వీరి ముగ్గురిచుట్టూ తిరుగుతూ ఉంటుంది కథ. తతిమా పాత్రలూ వారి వ్యవహారాలూ అవన్నీ వీరి తరువాతనే. వీరి మువ్వురితో ముడిబడి ఉన్నవే అవన్నీ కూడా. వీరిని చెబితే వారందరినీ చెప్పినట్టే. ఇందులోనే గతార్ధమయిపోతాయి. కనుకనే కథా వస్తువు కంతా సూచకంగా ద్యోతకంగా ఈ సీతారామ రావణ పాత్రలను మువ్వురినీ స్ఫురింపజేసే మూడు సంజ్ఞలే కల్పించాడు కవి తన కావ్యానికి. ఇందులో రామాయణం రామపాత్రను చెబితే- సీత చరితమనేది సీతపాత్రను పేర్కొంటే పౌలస్త్యవధ అనేది రావణపాత్రను నిర్దేశిస్తుంది. పులస్త్య ప్రజాపతి వంశంలో పుట్టాడు గనుక రావణుడికి పౌలస్త్యుడని పేరు.

  ఇంకొక విశేషమేమంటే ఈ మూడు పేర్లూ చెవినబడగానే భావుకుడైన పాఠకుడికి ఏడుకాండల రామాయణ గాధా వరసగా మనసుకు వస్తుంది. ఎలాగంటే రాముడే ఇతివృత్తాని కంతటికీ కథానాయకుడు. సీత ఆయన సహచరి గనుక కథానాయిక. వీరికి ప్రతి ద్వంద్విగా తయారయిన రావణుడు ఒక ప్రతినాయకుడు. నాయికా నాయకులు-ప్రతి నాయకుడు. వీరు మువ్వురే అటు దృశ్యానికైనా ఇటు శ్రవ్యానికైనా ఏ సాహిత్య నిబంధానికైనా కావలసిన ముఖ్యపాత్రలు. వాల్మీకి భంగ్యంతరంగా ఈ సాహితీ లక్షణ సంప్రదాయాన్ని కూడా తప్పక పాటించాడని మనకు తేటపడుతున్నది. మార్గదర్శీ మహర్షి అని గదా భోజుడు చాటాడు. సాహిత్య సంప్రదాయాన్ని ఆదికవి గనుక తాను దర్శించి అనంతర కవులనందరినీ దర్శింపజేశాడు. కనుకనే మహర్షి మార్గదర్శి అయ్యాడు.

  అంతేకాదు. దృశ్యకావ్యాలైన నాటకాల కొక లక్షణమున్నది. నాటకారంభంలో ఏదైనా వర్ణిస్తే అది నాటకకథా వస్తువుకంతా సూచకం కావాలి దాని అర్ధాన్ని భావన చేసే కొద్దీ నాటకం యావత్తూ మన కనుల ముందు ఒక్కసారి సాక్షాత్కరించాలి. ఇది దృశ్యకావ్యాలకు చెప్పిన లక్షణమైనా శ్రవ్యకావ్యాలకు కూడా ఉపలక్షణంగా తీసుకోవలసి ఉంటుంది. పైగా రామాయణం ఆదికవి శ్రవ్యంగానేకాక దృశ్యంగా

Page 40

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు