#


Index

కావ్యసంకేతము

కావ్య సంకేతము

  మనమింతవరకూ రామాయణ కవిని గురించి చెప్పుకొన్నాము. పోతే ప్రస్తుత మాయనగారు రచించి లోకానికి ప్రసాదించి పోయిన రామాయణ మహాకావ్యాన్ని గూర్చి చెప్పుకోవలసి ఉంది. ఒక్కమాటలో చెబితే అంతటి మహాకవి రచించిన గ్రంథం ఎంతటిదయి ఉంటుందో ప్రజ్ఞావంతులైన పాఠకులూహించుకోగలరు. రచయితను బట్టి రచనా గుణముంటుందని ఇంతకుముందే మనవి చేశాను. రచయిత ఇక్కడ ఎలాంటివాడు. ఒక మహాతపస్సంపన్నుడైన మహర్షి. క్రాంతదర్శి-త్రికాలజ్ఞుడు. లోకహిత కామనా శీలుడు. బ్రహ్మదేవుడే సాక్షాత్కరించి సరస్వతిని ప్రసాదిస్తే తత్ప్రసాదలబ్ధ సమస్త సారస్వత సారసత్త్వంగల మహాకవి. పైగా తాను రచింపదలచిన ఇతిహాసమేదో దాని పూర్వోత్తరాలు రెండూ బాహ్యదృష్టితో గాక అంతరమైన తపోదృష్టితో కరతలామలకంగా దర్శించి ఆకళించుకొన్నవాడు. అంతేగాక వ్యాసభగవానుడెలాగో అలాగే తాను సృష్టించిన కావ్యపాత్రలకు తానుకూడా సమకాలికుడయి కొంతవరకూ వారి కష్టసుఖాలలో పాలుపంచుకొన్నవాడు. ఇలాంటి మహాత్ముడి రచన ఎలా ఉంటుందో ఎంత ఉదాత్త గంభీరమో సహజ సుందరమో నానారసభావ బంధురమో, ఎంతైనా చెప్పవచ్చు. ఏదైనా చెప్పవచ్చు. ఇంత సర్వాంగ సుందరమయింది గనుకనే అందులో ఇక ఎలాంటి స్టాలిత్యానికి తావులేదు. అయినా దానిలో కూడా నెరసు లేరటానికెవరైనా ప్రయత్నించారంటే ఇక అది వారి అవివేకమే. ఇలాంటి అవివేకలుంటారనే ఏమో త్రికాలజ్ఞుడైన ఆ మహర్షే మనకు ముందుగా ఒక హెచ్చరిక చేశాడు. "శ్రోతవ్య మనసూయయా” అని గుణాన్నికూడా దోష దృష్టితో చూస్తారేమో అలా చూడకండి మహానుభావులారా ! జాగ్రత్తగా పూర్వాపరాలు కలియబోసుకొని కథాతాత్పర్యమేదో పట్టుకొని పోతే మీకిందులోని సారస్యమేదో బాగా హృదయంగమ మవుతుంది సుమా - అలాగే చూచి గ్రహించండి తరించండని ఆయన హెచ్చరిక.

  ఈ హెచ్చరిక నేమరకుండా మనం పయనం సాగిస్తే చాలు. మనబాట అంతా ఇక బంగారుబాటే. రామాయణమనే మాటనే పరామర్శ చేతాము మొదట. రామాయణమని కవి తన ఇతిహాసానికి పెట్టినపేరు. ఒక్కరామాయణమనే కాదు.

Page 39

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు