కోకిలే కాదు. సింహం కూడా నని వర్ణిస్తుంది మరొక శ్లోకం. “వాల్మీకేర్ముని సింహస్య కవితావనచారిణః - శృణ్వన్ రామకథానాదమ్ - కోనయాతి పరాంగతిమ్” వాల్మీకి ఒక సింహమట. సింహం వనంలో సంచరించినట్టే ఇది కవితావనంలో సంచరిస్తుంది. దాని నాదం చెవిన బడితే చాలు. వనంలో తిరిగే మ్రుక్కడి మృగాలన్నీ ఒక్కసారిగా గుండె ఆగి ప్రోణం కోలుపోతాయి. అలాగే ఈ కవి సింహుడు కూడా చేసే రామాయణమనే కావ్యనాదం వింటే చాలు. ఎవడైనా పరమపదాన్ని చేరటంలో సందేహం లేదంటాడు. ఇక్కడ చమత్కారమేమంటే ఆ సింహగర్జ వింటే ప్రాణాలు పోయినట్టే ఈ సింహగర్జ వల్ల కూడా పోతాయి. అయితే అది ప్రాణాలు పోయేవరకే. ఇది అలాకాదు. ప్రాయణానంతరం తప్పకుండా సాయుజ్యం లభిస్తుంది. కారణం ఇది మామూలు నాదంకాదు. రామకథానాదం. రామనామం సంసారతారకం గదా. కాబట్టి ముక్తిఫలం చవిచూడక తప్పదు.
అయితే ఒక ప్రశ్న ఏమిటంటే మొదట కోకిల అని వర్ణించి ఇప్పుడాయననే సింహమని వర్ణించటం. కోకిల ఎక్కడ ? సింహమెక్కడ దానిది కూజనం దీనిది గర్జనం. అది మధురంగా వినిపించి మనసు నలరిస్తే ఇది కర్కశంగా చెవిలోబడి ప్రాణాలు తీస్తుంది. ఒకే కవినిలా రెండువిధాల వర్ణించటమేమిటి. అదే ఇందులో ఇమిడి ఉన్న రహస్యం. కవేకాదు వాల్మీకి. ఋషికూడా. ఋషి గనుక తాత్త్వికుడు. కవి గనుక సాత్త్వికుడు. సత్త్వగుణం ఆయన కావ్యంగా పరిణమిస్తే తత్త్వగుణం అందులో అనున్యూతంగా ప్రవహించే ఆధ్యాత్మిక బోధ అయింది. ఇందులో బాహ్యమైన కావ్యశిల్పం మనకు కోకిల స్వరంలాగా మధురంగా వినిపించి మన మనసుకు సానుభూతినిస్తే అంతరమైన ఈ ఆధ్యాత్మిక శాస్త్ర శిల్పం ఒక మహా సింహగర్జనలాగా మనసుకెక్కి ఆత్మచైతన్య రసానుభూతినిచ్చి మనకంటుకొన్న ఈ భవబంధాలన్నిటినీ ఊడ్చి మనల నాబ్రహ్మతత్త్వం వైపుకే మరలా ఈడ్చుకొని పోతుంది. అది రామమైతే ఇది రామబ్రహ్మం. రెండూ మనకు వాంఛనీయమే. ఆనందదాయకమే. ఒకటి లౌకికానందమైతే మరొకటి అలౌకికానందం. ఇలా మన జీవితద్వయానికీ ఒక అమేయమైన కావ్యబంధమనే సేతుబంధాన్ని నిర్మించి మనలనందరినీ ఈ సంసార బంధంనుంచి విముక్తులను గావించిన మహానుభావుడు వాల్మీకి.
Page 38