మానవలోకం ఋణగ్రస్తమే. ఋణ బంధంనుంచి మనం విముక్తులం కావాలంటే తదీయ గ్రంథావలోకనం చేసి తరించటమొక్కటే ఉపాయం. అది తత్త్వ సాహిత్యమనే నెపంతో మొదటి వరస మనంకడవరకూ నెరవేర్చాము. పోతే సాహిత్య తత్త్వమనే ఈ రెండవ విడతలో మొదట భాగవత సామ్రాజ్యంద్వారా కొంతవరకూ తీర్చాము. పోతే దాని తరువాత రెండవ ఘట్టమైన రామాయణ రామణీయకంలో అడుగు పెట్టాము. దీని నామూలాగ్రమూ నిశితంగా పరిశీలించి చూడగలిగితే చాలు. వాల్మీకి మహాకవి కవితా ఋణంకూడా పూర్తిగా చెల్లించిన వాళ్లమవుతాము. వాల్మీకి బాకీ చెల్లించగలిగితే సాహితీ లోకం బాకీ అంతా చెల్లించినట్టే. వాల్మీకి కవి కవిత అంటే అలాంటిది. ఇప్పుడే చెప్పాము కాళిదాస భవభూతుల లాంటి మహాకవులకే సేవ్యుడూ ఉపజీవ్యుడూ అని.
ఏ మహానుభావుడు రచించాడోగాని వాల్మీకి మహాకవిని గూర్చి రెండు కమ్మని శ్లోకాలు సుందరకాండ ఉపోద్ఘాతంలో పొందుపరచబడి ఉన్నాయి. అవి రెండూ రెండు రత్నాల తునకలు. ఒకటి "కూజంతమ్ రామరామేతి మధురమ్ మధురాక్షరమ్ ఆరుహ్య కవితా శాఖామ్ వందే వాల్మీకి కోకిలమ్” వాల్మీకిని కోకిలతో పోల్చి వర్ణించబడింది. కోకిలతో పోల్చటంలో ఎంతైనా ఆంతర్యముంది. కోకిల మధురంగా కూస్తుంది. ఈయన మధురంగానే కాక మధురాక్షరంగానూ కూస్తాడు. అది రామరామ అని అనగలదో లేదో ఈ కవినోట మాత్రం రామ అనే అక్షరాలు స్పష్టంగా పలికాయి. అంటే కోకిలలాగా మధురమైన స్వరంతో రామకథాగానం చేశాడని అర్ధం. అంతేకాదు. అది తరుశాఖ ఎక్కి కూస్తే ఈయన కవితాశాఖ ఎక్కికూశాడు. అది పంచమ స్వరంతో కూస్తుంది. ఈ కవికూడా పంచమ స్వరంతోనే ఆలపించాడు. పంచమ స్వరమేమిటి. వేదాలు నాలుగుకాక పంచమ వేదమొకటున్నది. అదే రామాయణం. "వేదః ప్రాచేతసాదాసీత్ సాక్షాద్రామాయణాత్మనా" అని గదా ఆభాణకం. అపౌరుషేయమైన వేదాలవి అయితే పౌరుషేయమైన వేదమిది. అయిదవది. అవి నాలుగూ ఉదాత్తాది స్వర చతుష్టయంతో ఉచ్చరించేవైతే ఇది తంత్రీలయ సమన్వితమైన పంచమ స్వరంతో ఆలపించిన సారస్వత వేదం. వేదానికి శాఖలున్నట్టే దీనికి ఒక శాఖ ఉంది. అదే కవితాశాఖ. ఇలాంటి శాఖమీద ఎక్కి కూచొని పంచమమైన వేదాన్ని పంచమమైన స్వరంతో ఆలపించాడు గనుకనే వాల్మీకి కవి ఒక కోకిలే వాస్తవానికి.
Page 37