#


Index

కవి మాహాత్మ్యము

బయటికి వచ్చాయట. ఆ ముత్యాలతో కథానాయకుడైన రామచంద్రుడి గుణాలనే నాయకమణిని కూడా చేర్చి చక్కగా కూర్చిన సరాలట ఆయా రామాయణ కథా సన్నివేశాలన్నీ ముత్యాలలాగానే అవన్నీ సహృదయులైన మీ కంఠసీమలనన్నిటినీ అలంకరిస్తాయని వర్ణిస్తాడు. ఎంత మనోజ్ఞమైన విశిష్టమైన వర్ణనో చూడండి ఇది. ఇలాటి భావాలతో వర్ణించటమొక్క మురారికే చెల్లు. “మురారేస్తృతీయః పంథా” అన్నా రభిజ్ఞులు. ఎంత సారస్వతేయుడో అంత శాస్త్రజ్ఞుడాయన. శాస్త్రాన్ని కావ్యంగా మలచుకోగలడు. కావ్యాన్ని శాస్త్రంగా చూడగలడు. అలాంటి ఉభయతో ముఖదృష్టి అతనిది. అందుకే ఇంత ముగ్ధమనోహరంగా వర్ణించగలిగాడు. నిజానికి శ్రుతిస్మృత్యాదులైన శాస్త్రాలే రూపాంతరం చెంది రామాయణ మహాకావ్యంగా అవతరించాయి. అది కేవలం సరస్వతీనిష్యందం ఇక్ష్వాకువుల యశశ్శరీరం మురారి దృష్టిలో

  ఇలా సంస్కృత వాఙ్మయంలో ఎంతో చండప్రచండులని పేరు మోసిన మహాకవులే ఇంత భయభక్తులు ప్రదర్శించారు వాల్మీకి అంటే ఇక దేశభాషలలో కవులను గూర్చి చెప్పనక్కరలేదు. భారత భాగవతాలు రెండింటికన్నా రామాయణాన్నే ఆదర్శంగా పెట్టుకొని ఎన్నో భాషలలో ఎందరో మహానుభావులెన్నెన్నో రీతులలో రచన చేస్తూ వచ్చారు. ఇంతమంది దృష్టి నాకర్షించిదంటేనే ఇది ఎంత అసాధారణమైన రచనా శిల్పమో వేరుగా చెప్పబనిలేదు. దీని విశ్వతోముఖ వైభవానికిదే ఒక గొప్ప నిదర్శనం. అతిప్రాచీనుల దగ్గరి నుంచీ అతి నవీనులదాకా దీని అతిలోకమైన ప్రభావాన్ని తప్పించుకోలేక పోయారు. “హరి హరాజ గజాననార్కషడాస్య మాతృ సరస్వతీ గిరిసుతాదిక దేవతా తతికిన్ సమస్కృతి చేసి నిర్భరతపోవిభవాధికున్ గురుపద్య విద్యకునాద్యు నంబురుహగర్భనిభుం బ్రచేతసుపుత్రు భక్తి దలంచెదన్” అని మన తెలుగులోనే ఒక పూర్వకవి ఆయనకు ప్రణమిల్లితే “ఈ సంసారమిదెన్ని జన్మములకేనీ మౌని వాల్మీకి భాషాసంక్రాంత ఋణంబు తీర్పగలదా తత్కావ్య నిర్మాణ రేఖాసౌందర్య గుణంబు తీర్చగలదా” అని ఆక్రందన చేస్తాడు ఒక ఆధునిక కవి.

  ఇది అక్షరాలా నిజమైన మాట. ఆ మహర్షి కవితా ఋణం ఎప్పటికీ తీర్చుకోలేము మనం. శాస్త్రవాఙ్మయంలో భగవత్పాదుల ఋణమెలా తీర్చలేమో, కావ్యవాఙ్మయంలో ఆదికవి ఋణం కూడా అలాగే తీర్చలేము. ఇరువురికీ మన

Page 36

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు