ఇలా కాళిదాసు వంటి కవి కులగురువే ఆ కులపతినింతగా ప్రశంసించాడు. అసలు కవి అంటే మరి ఎవరూ కాదు. వాల్మీకి ఒక్కడేనని కాళిదాసు అభిప్రాయం. అందుకేనేమో వాల్మీకిని గూర్చి చెప్పవలసిన చోటనల్లా ఆయనను పేరుతో చెప్పడు. ఎక్కడైనా ఇక తప్పనిసరి అయితే చెబుతాడు వాల్మీకి అని. లేకపోతే కవి కవి, అని కవి నామంతోనే పేర్కొంటాడాయనను. కవిః కుశేధ్మాహరణాయ యాతః - కవిః కారుణికో వవ్రే కవియశః ప్రార్థీ - ఇలాగే నడుస్తుంది వ్యవహారం. కవిశబ్ద వాచ్యుడాయన ఒక్కడే వాస్తవానికి మేమంతా ఆయన శిక్షణలో పెరిగి ఇంకా పైకి రావలసిన కవి శాబకులమే నని కాళిదాసు హృదయం.
పోతే కాళిదాసు తరువాత భవభూతి చేసిన ప్రశంస ఇంతా అంతా గాదు. వాల్మీకి అంటే ఆయనపాలిటికి దేవుడే. ఆయన సృష్టించిన సీతారాముల నెంత ఆరాధించాడో ఆయన నంతగా సేవించాడు. "ఇదమ్ కవిభ్యః పూర్వేభ్యో నమోవాకమ్ ప్రశాస్మహే వందేమహిచ తామ్వాణీ - మమృతా మాత్మనః కలామ్” అని పూజాయామ్ బహువచన మన్నట్టు బహువచనంతోనే సంబోధిస్తాడాయనను. ఆయనకే గాక ఆయన వాక్కుకు కూడా నమస్కరిస్తానంటాడు. ఎందుకంటే అది అమృతమట అమృతంలాగా మధురమైనది. సర్వులకూ ఆస్వాదయోగ్యమైనది. అంతేకాదు. మృతంకానిది. అంటే ఆ చంద్రతారకంగా నిలిచేది. “యావత్ప్రస్యంతి గిరయః తావద్రామాయణ కథాలోకేషు ప్రచరిష్యతి” అనే రామాయణోక్తి కిది ప్రతిరూపోక్తి. అమృతమెందుకయిందావాక్కంటే చెబుతున్నాడు ఆత్మనః కలామ్మని. సూటిగా అది ఆయన ఆత్మచైతన్యం నుంచే దూసుకు వచ్చిందట. మధ్యలో ఏ ఉపాధితోనూ కలిసి కల్తీకానిదది. శబ్ద, గుణ, రీతి, అలంకారాది సామగ్రినతడు వెతుక్కోలేదు. అవే అతని భావాన్ని వెతుక్కుంటూ వచ్చి దానికి దాస్యం చేస్తూ వచ్చాయి. అందుకే అది స్వభావసుందరమని భవభూతి భావం.
భవభూతిలాగే మరి ఇద్దరు మహాకవులు. ఒకడు భోజుడు. మరొకడు మురారి. భోజుడు కవితాంభోజుడు. భోజకాళిదాస కథలలోని భోజుడే కావచ్చు. కాని కాళిదాసువంటి విలక్షణభావన, విశిష్టమైన రచన మరలా ఎక్కడైనా చూడాలనిపిస్తే అది ఒక్క భోజుడిలోనే కనిపిస్తుంది మనకు. ఎంత శాస్త్రజ్ఞుడో అంత మహాకవి. ఆయన రామాయణ చంపువతిలోకం. అనన్యా దృశం. వాల్మీకిమీద ఆయన
Page 34