#


Index

కవి మాహాత్మ్యము

  ఏతాదృశ సకల మహాకవి లక్షణ లక్షితుడు గనుకనే ఆయన కవికులానికంతటికీ ఆద్యుడూ, ఆరాధ్యుడూ అయినాడు. ఆయన గుణసంకీర్తన చేయని కవి అంటూలేడు. ఏ కవి కావ్యం వ్రాయటానికుపక్రమించినా మొదట ఆ ఆదికవికి మొక్కు చెల్లించిగాని తన రచనకుపక్రమించడు. ఇంతెందుకు. కవికులగురువని పేరుగాంచిన కాళిదాస మహాకవే అయిన నేమని కీర్తించాడో చూడండి. “నిషాదవిద్ధాండజ దర్శనోత్థః శ్లోకత్వ మాపద్యత యస్యశోకః" ఒక నిషాదుడు బాణంతో కొట్టి పడగొట్టిన ఒకపక్షిని వీక్షించటంవల్ల తన మనసుకు కలిగిన శోకమే ముఖంనుంచి శ్లోకరూపంగా వెలువడిన మహాత్ముడట ఆయన. “శోకః శ్లోకత్వమాగతః" అని రామాయణ పీఠికలోనే ఉన్న మాట ఇది. దానినే భంగ్యంతరంగా సమర్ధిస్తున్నాడు కాళిదాసు. అంటే వాల్మీకి కవిత్వమే మాత్రమూ కృత్రిమతా గంధం లేని సహజ సువాసనా బంధురమని ఆ మహర్షి కొక్కనికే దక్కిన ధనమని, కాళిదాసు ఘనంగా సమర్పించే కానుక. అంతేకాదు. ఆ రఘువంశంలోనే కుశలవులు రాముని కొలువులో గావించిన రామకథా గానాన్ని ప్రస్తావిస్తూ “వృత్తమ్ రామస్య, వాల్మీకేః కృతి, సౌకిన్నరస్వనౌ, కిమ్ద్యేన మనోహర్తుమలమ్ స్యాతామ్ నశృణ్వతామ్" రాముని చరిత్ర కావ్య వస్తువట. కావ్యప్రణేత వాల్మీకి మహాకవి అట. దానిని గానం చేసేవారా. కిన్నర కంఠులైన కుశలవులట. మరి ఆ కొలువులోని మానిసుల మానసాల నది హరించిందంటే ఆశ్చర్యమేమున్నదంటాడు. చూడండి. ఎంత వల్లమాలిన గౌరవమో వాల్మీకిఅంటే కాళిదాసుకు. గౌరవం ఎక్కువయ్యే కొద్దీ ఒకవిధమైన భయంకూడా ఏర్పడుతుంది. ఎందుకంటే ఆ స్థాయికి మనం ఎదగగలమా లేదా అని. అందుకే అంటాడు కాళిదాసు "మందః కవియశః ప్రార్థీ”నేనతి మూఢుడను. అయినా వాల్మీకిలాంటి మహాకవి యశోధనాన్ని దోచుకోవాలని చూస్తున్నాను. అది నాకు సాధ్యమా. "ప్రాంశులభ్యే ఫలేలోభా దుద్బాహురివ వామనః" బాగా ఎత్తరి అయిన మానవుడందుకోవలసిన పండునొక మరుగుజ్జు అందుకోవటానికి చేయిచాచటం లాంటిదే నా ఆశ. అదివట్టి అడియాసే. అయితే మరి ఎందుకు వ్రాస్తున్నావు మరలా అని అడిగితే ఇలా సంజాయిషి ఇస్తాడు. “అథవాకృతవాగ్ద్వారే వంశేస్మిన్ పూర్వసూరిభిః మణెవజ్ర సముత్కీర్లే సూత్రస్యేవాస్తి మేగతిః" అలాంటి మహాకవులు నాకంటే ముందుగానే వచ్చి ఈ రఘువంశమనే దుర్గానికి ముఖద్వారం నిర్మించిపోయారు. వారు నిర్మించిన ద్వారం తలుపులు తెరచుకొని ఆ కోటలో మాబోటి వారికి సుఖంగా ప్రవేశించవచ్చు.

Page 33

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు