స్వభావుడే. ఎన్నో పక్షులనూ, మృగాలనూ, తుదకు మానవులనూ మహర్షులనూ కూడా బాధించినా వాడే. అలాంటి తుచ్చమైన జీవితం నుంచి ఇప్పుడు స్వచ్ఛమైన స్థాయి కెదగగలిగాడు. అలా ఎదగని దశలో ఉన్నాడా కిరాతుడు. తత్కారణంగా అతిదారుణంగా ప్రవర్తించాడు. దాని ఫలితంగా అమాయికమైన పక్షి నేల గూలింది. ఆ పక్షి కళేబరాన్ని చూస్తే ఎక్కడ లేని సానుభూతి కలిగింది మహర్షికి. దానితో ఆవేశపరుడయి “మానిషాద ప్రతిష్ఠామ్ త్వమ్" అని కోపంతో శపించాడు. మరలా ఆ కిరాతుడి ముఖం చూచేసరికి తన పూర్వవృత్తమే స్మరణకు వచ్చి అయ్యో వీడూ అమాయికుడే గదా పక్షిలాంటి అజ్ఞానే వీడుకూడానని అంతకన్నా ఎక్కువ సానుభూతి కలిగింది వాడిమీద. దానితో ఉపశాంతుడయి మానిషాద ప్రతిష్ఠామ్ త్వమగమః నీవు నిషాదుడి ప్రతిష్ఠ అంటే నిషాదుడి ప్రవర్తనతో బ్రతకవద్దు. అది మంచిదికాదు. మానిషాద ప్రతిష్ఠాం అంటే పరమాత్మలాగా పరిశుద్ధ స్వభావుడయి తరించమని బోధించాడా వ్యాధుడికి. అలా బోధించినప్పుడే ఋషి కవి అయినాడు. ఆయన నోట వచ్చినమాట కావ్యమయింది.
ఇది ఏదో కథలాగా పైకి కనపిస్తున్నా ఎన్నో లోతైన కావ్యకళా మర్మాలనిది మనకు భంగ్యంతరంగా చాటి చెబుతున్నది. అదేమిటంటే లోకంలో ప్రతిఒక్కడూ మహాకవి కాలేడు. ఒక మహాకావ్యాన్ని సృష్టించలేడు. దానికతడు మొదట తత్సృష్టికి కావలసిన ప్రతిభావ్యుత్పత్త్యాదులు సంపాదించాలి. క్రాంతదర్శి అయినా ఋషియ సర్వతోముఖమైన దృష్టితో ఈ ప్రపంచాన్ని ప్రపంచాతిగమైన తత్త్వాన్ని దర్శించ గలగాలి. దర్శించటం వరకేగాక దానికి ప్రచోదన కలిగించే సన్నివేశం ప్రకృతిలో ఎక్కడ ఎప్పుడు తారసిల్లినా తన నిజజీవితంతో దానిని పోల్చుకొని స్పందించ గలిగిఉండాలి. అలాంటి స్పందనతో కలిగిన భావోద్రేకాన్ని మరలా రాజసతామస స్థాయికి దిగజారుతుంటే సాత్త్వికంగా మార్చుకొని తాత్కాలికమైన భావావేశ ప్రవాహంలో కొనిపోక దానిని స్తిమిత గంభీరమైన దృష్టితో అనుసంధానం చేసుకోవాలి. అలాటి అనుసంధాన బలంతో ఉచ్ఛరించేవాణి అదే కవితావాణి. అంతవరకూ ఋషి అయితే అప్పుడు కవి అవుతాడు. ఋషి అయిన కవి అవుతాడు. అంటే మహాకవి అవుతాడు. అలాంటి మహాకవి వాల్మీకి. మహాకవి అయి అతడు రామాయణమనే మహేతి హాసాన్ని సృష్టించాడు. కాదు మహాకావ్యాన్నే గానం చేశాడు.
Page 32