#


Index



ప్రత్యాలోకనము

ఆ పరాశక్తియే సీత. ఈ శివశక్తులు రెండూ కలిసి ఒకానొక దివ్య సంకల్పంతో ఆడిన అద్భుతమైన నాటకమే ఈ రామాయణ మహాకావ్యం. ఇందులో ప్రతి పాత్రా వారి సంకల్పాని కనుగుణంగా సృష్టి అయినదే. అవి వారు సృష్టించుకొన్న పాత్రలే. అవేగాక వాటితో పాటు తమ పాత్రలు కూడా తాము సృష్టించుకొన్నవే. నేను మానవుడిరూపంలో పుత్రకాముడైన దశరథుడికి జన్మించి ఈ ఈ కార్యాలు నెరవేర్చి ఇంతకాలమీ పృథివిని పాలించి వస్తానని ఆయన చెప్పి వచ్చాడీ నాటక రంగంలోకి. అలాగే నేనీ దుర్మార్గుణ్ణి సంహరించి వీడి అధర్మ మార్గాన్ని అరికట్టి ధర్మమార్గాన్ని మరలా ఉద్దరించటానికా పరమాత్మకు చేదోడుగా మానవ రూపంలోనే అవతరిస్తానని చెప్పి ఆవిడా అడుగు పెట్టింది రంగభూమిలో. చూడబోతే ఒక సూత్రధారుడిలాగా ఆయనా, నటిలాగా ఈవిడ ఇద్దరూ మారువేషాలతో వచ్చారు మనముందుకు. అలా వచ్చిన ఆయా భూమికలు ధరించి వచ్చిన దశరథ విశ్వామిత్ర సుగ్రీవ విభీషణ హనుమాదాది పాత్రలలో కలిసి సాత్త్విక వాచి కాంగికాద్యభినయాలన్నీ ప్రదర్శించారు. అనుచితమైన కామాన్ని సముచితమైన కామాన్నీ కూడా తాము అభినయిస్తూ వారందరిచేత అభినయింపజేశారు. దాని శుభాశుభ పరిణామాన్ని కూడా చవిచూచినట్టు నటించారు. ఇది కామాభినయమైతే పితృవాక్య పాలనాదుల వ్యాజంతో ధర్మాభినయం కూడా తాము చేసి చూపారు. హనుమ ద్విభీషణాదుల ద్వారా చూపించారు. పోతే ఇదంతా కాదు. చివరకన్నీ కలిసి అపవర్గానికే దారి తీయాలి. అప్పుడే శాశ్వతమైన సుఖశాంతి మానవజాతికని ఒంటిగా చేసిన తమ మహాభినిష్క్రమణం ద్వారా మౌనభాషలో సూచించారు మనకు. మా అభినయ మింతటితో ముగిసినా దీనివలన కలిగే అనుభవం అది మీ కెప్పటికీ నిలిచి ఉండాలని మహాజ్ఞాని మహాయోగి అయిన హనుమంతుడనే ఒక మహా పురుషుణ్ణి ఈ ప్రదర్శనకంతా చివరకొక ప్రతినిధిగా పెట్టి అంతర్ధానమయి పోయారు.

  కేవల నీతి అనే స్థాయిలోనే గాక భూతి అనే స్థాయిలో ఇలా అర్ధం చేసుకొని చెప్పినా చెప్పుకోవచ్చు మన మీ రామాయణ మహేతిహాసం. అంతా రామ అయనమే ఇది. ఆ రాముడాత్మా రాముడే. ఆయన చైతన్యశక్తి విలాసమే ఇదంతా. ఆ శక్తి ప్రభావంతో అవతరించినట్టు చేసినట్టు తన జీవితాన్ని ఒక మహానాటకంగా ఆ పరమాత్మ ప్రదర్శిస్తే ఆ నాటకంలో ధ్వనింపజేసిన జీవిత సత్యాన్ని మరలాభావుకులైన

Page 334

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు