ఆముష్మికం కాదు. ఐహికానికి ప్రయోజనం ఇహ జీవితం వరకే. పరందాకా ప్రసరించదది. జీవిత మాఖరయితే అది ఆఖరయి పోతుంది. అంతేగాక కామమనేది వ్యక్తిగతమేగాని సమాజగతం కాదు. వైయక్తికమైన సుఖమే దాని పరమావధి. సమాజానికి దానివల్ల ఒనగూడేదేదీ లేదు. అందులో కూడా ధర్మబద్ధమైతేనే. తద్విరుద్దంగా సాగితే మరలా దానివల్ల సమాజానికి చెరుపు. ధర్మబద్ధమైనా మరీ ఎక్కువైతే వైయక్తిక జీవనానికి కూడా శాంతిలేదు. సుఖము శాంతేగదా జీవితానికి వాంఛనీయం. అది వైయక్తికమైన కామంలో లేదు. మరెక్కడ ఉంది. అది కావాలంటే వ్యక్తిగతమైన పరిధిని దాటి అంతకన్నా విశాలమైన సమాజ క్షేత్రంలో అడుగు పెట్టాలి మనం. అప్పుడది కామాని కతీతమైన ధర్మం. నిష్కామ కర్మ యోగమంటే అదే.
కాగా ఏవం విధ నిష్కామ కర్మయోగానికి ప్రతీకలుగా సృష్టించబడ్డవే విశ్వామిత్రా దిపాత్రలన్నీ, ఎక్కడి నుంచో చుక్క తెగిపడ్డట్టు వచ్చి రాముణ్ణి వెంట బెట్టుకొనిపోయి అస్త్రశస్త్రాది విద్యలన్నీ ఉపదేశించి శివధనుర్భంగం ద్వారా కీర్తి దెచ్చి సీతతో వివాహం జరిపి ఆయననొక ఇంటివాణ్ణి చేసి ఎంత హఠాత్తుగా వచ్చాడో అంత హఠాత్తుగా వెళ్లిపోయాడు విశ్వామిత్రుడు. దారిలో పరశురాముడెదురయి పరీక్ష అనే వ్యాజంతో ఆయనకు తన వైష్ణవమైన తేజాన్నే అర్పించి తప్పుకొన్నాడు. భరతుడైతే అయాచితంగా తనకు లభించిన ఐశ్వర్యాన్ని కూడ అక్రమమని త్రోసిపుచ్చి ఆయనను మరలా పట్టణానికి తేవాలని శతవిధాల ప్రయత్నించి ఒప్పకపోతే చివరకు పంతానికాయన పాదుకలైనా తెచ్చి వాటిచేత రాజ్యపాలన సాగించాడు. మరి గుహుడు పామరుడైన ఒక కిరాతుడయికూడా తనకిరాత రాజ్యాన్నే ఆయన కప్పగించి యావజ్జీవము కొలువు 'చేస్తానంటాడు. మరి మారీచుడెన్ని విధాలనో రావణుడికి హితంచెప్పి వాడు వినకపోతే ఈ దుర్మార్గుడి చేతిలో చావటంకన్నా ఆ మహాత్ముడి చేతిలో చావటమే మేలని తన ప్రాణాలే చివరకు బలిచేశాడు. పోతే జటాయువనే దొక పక్షి అయి కూడా తన కళ్ల ఎదుట ఒక దారుణం జరుగుతుంటే చూడలేక ఆ అన్యాయాన్ని ధైర్యంతో ఎదరించి తన జీవితాన్నే ధారపోశాడు. ఇక తపస్సంపన్నులు పరమ ధార్మికులు అయిన అగస్త్యాది మహర్షులంతా సమాజ హితం కోరి ఒక క్షత్రియ వీరుడికి తమ దగ్గర దాచి ఉంచిన అస్త్రశస్త్రాదులన్నీ అప్పగించారు. పోతే హనుమంతుడి విషయమిక చెప్పేది కాదు. ఆ జన్మ బ్రహ్మచారి అయిన అతడు నిష్కామ యోగానికొక అద్భుతమైన
Page 332