#


Index



ప్రత్యాలోకనము

తన్ను బ్రతిమాలినా వినక వాణ్ణి రాజ్యం నుంచి వెళ్లగొట్టి ముప్పుతిప్పలు పెట్టాడు. అతడి ప్రాణాలకే ఎసరు పెట్టాడు. ఎంతో బలశాలి అయికూడా కామాంధకారం కన్నులకు గప్పి ధర్మమార్గం తప్పి ప్రవర్తించాడు. అందుకే భగవదాశ్రయానికి నోచుకోక తన బలాన్నే తాను నమ్మి దైవబలానికి దూరమై మీదు మిక్కిలి తదాగ్రహానికి విలువైన తన జీవితమే ఆహుతి చేయవలసి వచ్చింది. ఇది వాలి పరిస్థితి అయితే ఇంతకన్నా దారుణమైన పరిస్థితి రావణుడిది. బ్రహ్మ వంశోద్భవుడై, పరమ శివారాధకుడై, దుష్కరతపోప్రలబ్ధ దుర్లభ వరభావుడై, సకల భోగభాగ్య సంపన్నుడై ఆ పాతాళ స్వర్లోక నిరాఘాటరథ సంచారుడై అసాధారణ ప్రజ్ఞాధురీణుడై కూడా పరదార హరణమనే ఒక పాపిష్ఠ చర్య మూలంగా సమూలంగా నాశనమయి పోయాడు. చూడబోతే నరులు లేరు. వానరులు లేరు. దానవులు లేరు. ధర్మవిరుద్ధమైన కామాన్ని సేవిస్తే. ఏ జీవి అయినా చివరకు పరాభవంపాలు కావలసిందే. ప్రాణాలు దానికి పణంగా చేసి పోవలసిందే. అనే ఒకానొక లోకోత్తరమైన నీతిని మహాకవి ఎంత రమణీయంగా లోకానికి చాటుతున్నాడో చూడండి.

  పురుషులలోనే గాదు. స్త్రీ జాతిలో ఉన్నా అది ప్రమాదకరమే నని చెప్పటానికి కైకేయి, శూర్పణఖలనే పాత్రలను కూడా చిత్రించి చూపాడు మహర్షి. కైక తనకు భర్త వశంవదుడు గదా తనఢాకకెదురే ముందని ఏదో చేయబోయి ఏదో అయిపోయింది. ఇటు కుటుంబంచేత అటు సమాజంచేత కూడా ఛీ అనిపించుకొని తల ఎత్తుకొని తిరగలేని అనాథ బ్రతుకు బ్రతకవలసి వచ్చింది చివరదాకా. శూర్పణఖ మగడెలాగూ పోయాడు గదా అన్నదమ్ములతి లోకవీరులు గదా నేను దానవిని కామరూపిణిని గదా అని కామోన్మాదంతో కోరరాని కోరిక పరమాత్మనే కోరి దానికి ప్రతిఫలంగా ముక్కు చెవులు కోయించుకొని అప్పటికి కసిదీరక సోదరులనే రెచ్చగొట్టి తన్నిమిత్తంగా తానూ తనవాళ్లు అందరూ చివరకు రామ కోపానల జ్వాలలో మిడుతలలాగా మ్రందిపోయారు. ఒక్కకైకా శూర్పణఖలనే గాదు. ఆ మాటకు వస్తే వాలి భార్య తార, రావణుడి భార్య మందోదరి గతి కూడా ఇంతే అనుచిత కామోపసేవనం వల్లనే వారి జీవితాలు కూడా వల్లకాటి పాలయినాయి. భర్తలకు నచ్చజెప్పి వారి నా అపమార్గం నుంచి తప్పించలేక పోయారిద్దరూ. వారివల్ల తమకు సంతృప్తి కలిగితే చాలు. ఇకవారెలా పోతే నేమని ఒక ఔదాసీన్య మవలంబించారు.

Page 330

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు