దానితో ఆయన లోకులమీద నెపంపెట్టి ఆవిడను కానలకు సాగనంపితే కడపట ఆయన లోకులు ఇద్దరూ బ్రతిమాలినా పెడచెవిన బెట్టి పంతంగా ఆవిడ భూమిలోకి వెళ్లిపోయింది. ఇంతకు వీరిద్దరి వ్యవహారంవల్లా మనం గుర్తుంచుకోవలసిందొకే ఒక సత్యం. ఏదైనా అనుమానిస్తూ పోతే అది ఆగ్రహానికి దారి తీసి ఆ ఆగ్రహం మానవుడి సుఖానికి ముప్పుతెస్తుందని. దీనికంతటికి మూలకారణం విపరీతమైన స్నేహము, ప్రణయము. అతిసర్వత్ర వర్జయేత్తన్నారు. అత్యంతమైతే ఏ భావమైనా అత్యాహితానికే దారి చేస్తుంది. ప్రణయమైనా అది ప్రళయమే అవుతుంది. సీతారాముల మీద నెపం పెట్టి మహాకవి లోకానికి చాటుతున్న పరమ సత్యమిది.
అంతేకాదు. సీతారాముల ప్రణయమింకా కొంతమేలు. అది వారిద్దరి మధ్య ఏర్పడి ఇద్దరి మధ్యనే సమసిపోయింది. వారిరువురి మనసులే చివరిదాకా మధనపడుతూ వచ్చాయిగాని అంతకు మించి సమాజానికి వారివల్ల జరిగిన ఉపద్రవమేదీ లేదు. పోతే ఆయన తండ్రి దశరథుడి ప్రణయ వృత్తాంత మిలాంటిది కాదు. అది ఆ ముసలాయన ప్రాణాలకు ముప్పుతేవటమే గాక రాజకుటుంబాన్ని లోకులను కూడా బాధించింది. ఎంతో మంది రాణులుండగా అందులోనూ పట్టమహిషి తనకు విధేయురాలు కౌసల్య ఉండగా అంతకన్నా సాధుశీల, వినయవతి సుమిత్ర ఉండగా ఆ రాకాసి కైకనే ఆత్మీయురాలుగా భావించట మేమిటావిడ ప్రేమ వ్యామోహ మలాంటి దనుకోవాలి మనం. అంత వ్యామోహం గనుకనే అనవసరంగా ఆమె తండ్రి కేకయ రాజుకు నోరు జాఱి తాను వాగ్దానం చేయవలసి వచ్చింది. దాని ఫలితంగా పెద్దవాడైనా రాముణ్ణి కాదని చిన్నవాడైన భరతుడికే పట్టం కట్టవలసి వచ్చింది. ఆయన ప్రారబ్ధం కాకపోతే రాముడే జ్యేష్ఠుడై పుట్టాలా ? భరతుడే అలా జన్మించి ఉంటే ఏ సమస్యా లేకపోయేది గదా. లోకాపవాదము లేకపోయేది గదా నలుగురి నోళ్లలో నానవలసిన కర్మ పట్టే ఆ ముసలాడికా బుద్ధి పుట్టటం. పట్టిందంటే దానికెక్కడ ఉంది మూలం. అసామాన్యమైన కామోపసేవనమే మరేదీగాదు. ఇది రాముడిలాంటి వాడే ఎత్తి చూపిన విషయం. దానితోనే ఆ వృద్ధుడు పుత్రవియోగానికీ లోక ప్రవాదానికి కూడా గురి అయి చివరకు బ్రతకటానికే నోచుకోక హరి అన్నాడు.
పోతే ఇక కిష్కింధకు వస్తే వాలి వృత్తాంతం కూడా ఇలాంటిదే. తారతో తృప్తి పడక తన తమ్ముడి భార్య రుమను కూడా స్వీకరించాడు వాలి. అతడెంత విధేయతతో
Page 329