ఉన్నాడో లేదోనని భయపడుతుంది. ఆయన మరణించే ఉంటే ఈపాటికి స్వర్గంలో ఏ అప్సరసలతోనో క్రీడిస్తూ ఉంటాడని అంత వాడినే అనుమానిస్తుంది. ఈ అనుమాన పిశాచమెంతగా ఉందంటే ఆవిడకు లక్ష్మణుడన్నా అనుమానమే. హనుమంతుడన్నా అనుమానమే. అతనితో వెళ్లటమన్నా అనుమానమే. రావణుడు రాముడి శిరస్సు తెచ్చి చూపినా అనుమానమే. ఇంకా మనం మిగతా రామాయణాలను కూడా నమ్మేట్టయితే లక్ష్మణుడు సభలో కర్మజాలక నవ్వినా అనుమానమే. హనుమంతుడు తానిచ్చిన ముత్యాలదండ ముక్క చేసి పారవేసినా అనుమానమే. ఇలా అనుమానించటమనేది సీత స్వభావమైతే అయిన దానికి కాని దానికి ఆగ్రహిస్తూ కూచోటమాయన స్వభావం. ఆగ్రహమంటే కోపమని గాదు. పట్టుదల పంతగించటమని అర్ధం. ప్రతిదీ పంతమే రాముడికి తండ్రినోట ఇంకా మాట వచ్చిందో లేదో బయలుదేరాడరణ్యాలకు. భరతుడు వచ్చి కాళ్లా వేళ్లా పడ్డా ఇక రానుగాక రానన్నాడయోధ్యకు. సీత తెలియక కోరిందే ననుకోండి. ఆవిడకు తెలియజెప్పటం పోనిచ్చి అడిగింది ఎలాంటిదైనా సరే తెచ్చి ఇవ్వవలసిందేనని పంతంతో పడిపోతాడా మాయలేడి వెంట. సుగ్రీవుడు తన మాటే మరిచిపోయాడని కోపంతో అతడిమీదకి లేస్తాడు. విభీషణుడు శత్రుపక్షం వాడతణ్ణి చేర్చుకోవద్దని ఎవరు చెప్పినా వినక చేర్చుకొంటాడు. ఇది మంచి, ఇది చెడ్డ అనిగాదిక్కడ. ఒక వ్యక్తికెంతటి పంతమో లోకానికి చూపటమే. ఎవరి మాట విననీయదది. తన మాటే మాట. తన మతమే మతం. దృఢవ్రతః అంటే ఇదే అర్ధం. ఈ వ్రతదార్ధ్యమెంత దూరం పోయిందంటే తన భార్య శీలాన్నే తాను శంకించేదాకా పోయింది. ఒకరంటే కాదు. అనక ముందే లంకలో ఆవిడ ననుమానించి నలుగురి ఎదుటా అవమానకరముగా మాట్లాడింది ఎవరూ పల్లెత్తు మాట అనకుండానే గదా. చివరికిక అయోధ్యలోనైతే ఎవరో కొందరు పామర జనులన్నారనిచెప్పి తనకెంత నమ్మకమున్నా ఆత్మను కూడా చంపుకొని నిండుచూలాలని కూడా చూడక అడవిపాలు చేశాడావిడ జీవితం. దానికి మెఱుగు పెట్టినట్టు మాట ఇచ్చానన్న సాకుతో తనకోసం జీవితాన్నే అంకితం చేసిన తమ్ముణ్ణి దేశం నుంచి వెళ్లగొడతాడు. ఇలాంటిది రాముడి ఆగ్రహం. చిత్రమేమంటే ఇవి రెండూ చివరకు ఒకదానికొకటి కుండమార్పిడి అయినాయి. సీత అనుమానం రాముడికి వచ్చి రాముడి ఆగ్రహ బుద్ధి సీతకు సంక్రమించింది.
Page 323