సర్వేషు భూతేషు, తిష్ఠంతమన్నట్టు అవి చలంగా సర్వత్రా వెలుగుతున్నదా మూర్తి. ఆలిఖంత మివాకాశ మవష్టభ్యమహద్దనుః మహాధనుస్సును ధరించి ఆకాశాన్ని కాపాడుతున్న మూర్తి. మహాంతం విభు మాత్మాన మన్నట్టున్నదీ మాట. అంతేకాదు. అసలా విగ్రహమెలా ఉంది. పద్మపత్ర విశాలాక్షం దీర్ఘబాహు మరిందమమ్. సీతా హనుమంతులు తనకింతకు ముందు నుంచీ వర్ణిస్తూ వచ్చిందే అది. విశాలాక్షము దీర్ఘబాహువు. విశాలాక్షమంటే సర్వజ్ఞత. దీర్ఘబాహువంటే సర్వశక్తత. అంటే జ్ఞానైశ్వర్యాలు రెండు సమగ్రంగా ఉన్న ఈశ్వరుడే. అరిందమ అంటే ఆ రెంటిచేతా నిర్వహించే ధర్మ సంస్థాపన. ఇలాంటి రూపాన్ని దర్శించాడంటే ఆ వైరభక్తుడు దర్శించిన రూపమాపరమాత్మ సగుణ రూపమేనని వేరుగా చెప్పనక్కరలేదు.
మరి ఈ సగుణ మాత్రంతో తృప్తిలేదు సాధకుడికి. అది నిర్గుణంగా మారితేనే పరమాత్మ సాయుజ్యం. అది ఎలాగ. ఆయనతో తలపడటమే దానికి మార్గం. అది ప్రతిలోమంగా పైకి తోచినా లోపల అనులోమమే. సర్వాత్మనా తత్త్వాన్ని ఆశ్రయించే చర్య అది. సర్వధర్మాన్ పరిత్యజ్య అన్నట్టు దానికి తనకున్నదంతా పూర్ణాహుతి చేయవలసిందే. అలాగే చేశాడు. తన పదితలలు, ఇరువది చేతులు కూడా. అందులో పది తలలనేవి దశదిశల చూచి గడించిన తన వైషయిక జ్ఞానమైతే ఇరువది చేతులనేవి తద్వారా తానీ జీవితంలో కావించిన సన్యాప సవ్య క్రియాకలాపం. యథాకర్మ యధాశ్రుత మన్నట్టు ఈ ప్రాకృతజ్ఞాన కర్మ కలాపమంతా అప్రాకృతమైన ఆ రామబ్రహ్మానికి బ్రహ్మార్పణం చేశాడు. ఇక ప్రాణశక్తి ఒక్కటే మిగిలి ఉన్నది. అది కూడా ఆయన బ్రహ్మాస్త్ర వహ్నిలో పేల్చి పారేశాడు. బ్రహ్మాస్త్రమేదో గాదు. బ్రహ్మాకారవృత్తే. ఆ వృత్తి జ్ఞానమే వహ్నిలాగా పనిచేసి సాధకుడి ప్రాణశక్తి నొక హవిస్సులాగా స్వీకరిస్తుంది. పోతే ఇక మిగిలిందేమిటి సాధకుడికి. రావణత్వం కాదు. దశగ్రీవత్వంకాదు. లంకా పతిత్వం కాదు. మరేదిగాదు. భగవత్సాయుజ్య మొక్కటే. అదే అతని జయత్వం పరాజయంలాగా కనిపించినా ఇది చివరకు జయమే. భౌతికంగా పరాజయమైతే ఆధ్యాత్మికంగా పరిపూర్ణమైన జయమిది. అందుకే ఇది నిజమైన యుద్ధం కాదు. యుద్ధమనే వ్యాజంతో భగవద్భాగవతుల మధ్య జరిగిన నిగూఢమైన వ్యవహారం. అందుకే గగనం గనాకారం, సాగరస్సాగరోపమః రామరావణ యోర్యుద్ధం రామ రావణ యోరివ అని చాటిచెప్పాడు లోకానికి మహర్షి
Page 322