#


Index



రామ రావణులు

హరించాడు. ఇక తనకు దక్కింది సత్త్వం బొత్తిగాలేదు, రజస్తమస్సులు రెండే. అవి ఉండీ ఉపయోగంలేకపోయింది. అప్పటికి మాయా సీతను వధించి ఆయనను మాయారాముడి శిరస్సు చూపి ఆవిడను, పురాణ దంపతుల నిద్దరినీ మభ్యపెట్టజూచాడు. అది కూడా ఫలించదు పొమ్మన్నాడాయన. ఇక లాభంలేదని రజస్తమస్సులనే రెండు గుణాలలో తమోరూపుడైన కుంభకర్ణుణ్ణి ముందుకు నెట్టాడు. దాన్ని తుదముట్టించాడాయన. తరువాత రజోరూపుడైన ఇంద్రజిత్తును పురికొల్పాడు. దాన్ని చిత్తుచేశాడాయన. అంతకుముందే విభీషణుడనే సత్త్వగుణం తన్ను ఎలాగూ వదలిపోయింది. ఇప్పుడు రజస్తమస్సులు కూడా పోయాయి. ఇక తనకు కావలసింది ఒక్కటే. అది రజస్సు కాదు. తమస్సు కాదు. కేవలసత్త్వము కాదు. మూడింటికీ విలక్షణమైన శుద్ధసత్త్వం. గుణం కాని గుణమది. అది ఆ పరమాత్మ దగ్గర నిత్యానపాయిని అయి ఉన్నది. తనదగ్గర ఉన్నట్టు భాసించినా అది వట్టి ఆభాసే. వాస్తవం కాదది. వాస్తవంగా అది అక్కడే ఉన్నది. అది తనకు సంక్రమిస్తే గాని తదీయ సాయుజ్యానికి నోచుకోలేడు. సంక్రమించాలంటే తనకున్న రజస్తమస్సులనే గాక తన మలిన సత్త్వాన్ని కూడా హరించాలాయన. హరించేలాగ చేసుకోవాలి తాను. అలాగే చేసుకొన్నాడు తాను. హరించాడాయన. పోతే తనకిక సాయుజ్యాన్ని ప్రసాదించాలా పరమాత్మ.

  ఎలా ప్రసాదించాలది. ఎలా ప్రాప్తిస్తుంది తనకది. తన ప్రయత్నము, తదనుగుణంగా ఆయన ప్రసాదము, రెండూ కలిసి రావాలి. తన ప్రయత్నమాయన సగుణమైన రూపాన్ని మొదట దర్శించటమే. అది యుద్ధభూమిలోనే. యుద్ధం చివరకు వచ్చినప్పుడే. యుద్ధభూమి ఈ సంసారమైతే చివరకు రావటం బహూనాం జన్మనామంతే అన్నట్టు సాధకుడి అంతిమ జన్మ. అప్పటికీ జీవుడికీ పుత్రమిత్రాది పరివారమంతా తీరిపోతుంది. దేనిమీద ఇక ఆశలేదు. ప్రాణత్యాగానికి కూడా సిద్ధమే. అది ఒక బంధమే గదా జీవాత్మకు. ప్రాణమే జీవమంటే. దాన్ని వదులుకోవటానికి సిద్ధమంటే జీవభావాన్ని పోగొట్టుకొనే ప్రయత్నమే. అదే ఇప్పుడు రావణుడి సన్నాహం. అదుగో అంతవరకూ మరుగుపడిన రామబ్రహ్మమప్పుడు దర్శనమిచ్చాడు. అంతవరకూ రామశ్రవణమే గాని రామదర్శనం కాలేదు రావణుడికి. అదే ఓం ప్రథమమలాంటి దర్శనం సదదర్శతతోరామం - తిష్ఠంత మపరాజితమ్. సమం

Page 321

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు