#


Index



రామ రావణులు

ఆసీనమయి ఉన్న సీతావిగ్రహం. అదికూడ దగ్గరకు రానీయదా వామాచారుణ్ని. దగ్గర చేరితే చాలు. భగ్గుమంటాడు. దానిని తాను పట్టుకొనే తేవచ్చు. పట్టుపడ్డదనే సంతోషించవచ్చు. అయినా తనకు పట్టుపడలేదు. అనుభవానికి రాలేదు. ఇంతకూ దగ్గర ఉన్నా శక్తిహీనుడే రావణుడు. భౌతికంగా అది దగ్గర లేకున్నా స్వశక్తి సంపన్నుడే రాముడు.

  అయితే చమత్కారమేమంటే ఇదంతా తెలుసు రావణుడికి. తనకది ఎంత గింజుకొన్నా ఆధీనం కాదని తెలుసు. 'అనుభవానికి రాదని తెలుసు. వ్యక్తమైన రూపాన్ని పట్టుకొన్నా అవ్యక్తమైన తత్త్వాన్ని గ్రహించనంతవరకూ అది నిజమైన అనుభవం కాదని భంగ్యంతరంగా చాటటమే ఇందులోని భావార్ధం. పోతే ఆవిడను బలవంతం చేసి తెచ్చినట్టు తనబంధంలో ఉంచినట్టు కనిపించేదంతా బాహ్యార్ధం. పూర్వం శుంభాసుర మహిషాసురాదులంతా ఆ మహాశక్తి రూపాన్ని చూసి వ్యామోహ పడటము, ఆవిడను పెండ్లాడాలని తహతహ చూపటము కూడా ఇలాంటిదే. శుంభుడావిడను పెండ్లాడలని కోరితే కాళిక ఒక్కటే మాట చెప్పింది. క్వాసౌ మందమతిః శుంభః క్వవా విశ్వవి మోహిని, అయుక్తఃఖలు సంసారే వివాహ విధి రేతయోః మందబుద్ధి ఈ శంభుడెక్కడ. జగన్మోహిని ఆ దేవి ఎక్కడ ? ఇలాంటి వివాహాలు కూడా ఉంటాయా లోకంలో సింహీ కింత్వతికామార్తా జంబుకం కురుతే పతిమ్. ఒక ఆడు సింహమెంత కామాతుర అయినా ఒక బక్కచిక్కిన నక్కను పెండ్లాడగలదా ? చూడండి. ఈ సింహజంబు కోపమానం సరిగా సీత రావణుడి విషయంలో ప్రయోగించిన ఉపమానమే. పోతే ఆ దేవి స్వయంగా అన్నమాట చూడండి. మత్సమానబలః శూరోరణే మాం జేష్యతి స్ఫుటమ్. తంపరిష్యామ్యహం కామం. నాతో సమబలుడైన నన్ను రణరంగంలో జయించగలవాడెవడో వాడే నాకు రమణుడు. సమబలుడెవడు? శక్తిలాగా సర్వవ్యాపకుడైన పరమాత్మే. వాడే దాన్ని స్వాధీనం చేసుకోగలడు. దాని బలంతో ఈ సృష్టిస్థితి లయాదులు సాగించగలడు. వాడెవడో కాదు. ఆత్మారాముడైనరాముడే. ఆ రాముడి శక్తినంతటి స్థాయి కెదిగితేగాని ఏ జీవుడూ అందుకోలేడు ఆధీనం చేసుకోలేడు. అలా ఎదగాలనే ఇప్పుడీ దానవభక్తుడి ప్రయత్నం ప్రతిలోమ మార్గంలో పైకి కనిపిస్తున్నా ఆంతర్యంలో అనులోమమే. అర్హత లేకుండా తన శక్తి నపహరిస్తే ఎలాగూ అనుమతించడా

Page 318

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు