చూడండి. అతని ఊహకు తగినట్టే సీత ఆ కనక మృగాన్ని చూచి ముచ్చటపడనూ పడింది. రాముడది ఒక మృగతృష్ణయే అని తెలిసినా ఆ మృగతృష్ణతోనే దాని వెంటబడి పోయాడు. సీత నిష్ఠురోక్తులు భరించలేక లక్ష్మణుడు ఆశ్రమం విడిచి వెళ్లాడు. ఏది ఊహించాడో ఆ దానవ భక్తుడది అలాగే చేసి చూపాడా పరమాత్మ కూడా. అతడలా ఊహిస్తాడనే ఆయన చేశాడు. ఆయనలా చేస్తాడనే అతడూహించాడు. మొత్తానికి దైవశక్తి నాచుకోవటానికి తన అసుర మాయను ప్రయోగించాడు రావణుడు. అది హిరణ్యవర్ణంలో చిత్రవిచిత్ర కాంతులతో తళతళలాడుతూ రాముణ్ణి తనవెంట తిప్పుకొన్నది. అయితే ఆయనేమి చేతగానివాడా గమనించాడు. తన భక్తుడి పన్నాగం. అసుర మాయను వెచ్చపెట్టి దేవమాయను స్వాయత్తం చేసుకో దలచాడా అంత సమర్థుడతను. చూతమయినా వీడి సామర్థ్య మెలాంటిదోనని ఆ అసుర మాయనొక్కవాడి బాణంతో ప్రాణాలు తోడి వైచి నీ మాయకు నేను జవాబు చెప్పాను పోతే ఇక నా మాయకు నీవేమి చెప్పగలవో చెప్పమన్నట్టు దాని కవకాశమిచ్చాడు. అది ఒక సువర్ణావకాశమని వాడు ఒంటిగా ఉన్న సీత నపహరించి తన ఇంటికే కొనిపోయాడు. ఎక్కడికి కొనిపోయింది స్వామి వారికి తెలియదేమోనని దారిలో ఎదిరించిన జటాయువును కొనఊపిరితో వదలివెళ్లాడు. అమ్మ తన ఆభరణాలన్నీ మూటగట్టి ఋశ్యమూకం మీద వానరుల ముందు పడవేస్తుంటే చూస్తూ వెళ్లిపోయాడు. ఆ జటాయువెలాగూ తన వార్త చెబుతుందని తెలుసు. ఆ వానరుల దగ్గరికాయన ఎలాగూ రాక మానడనీ తెలుసు. లేకుంటే దాన్ని పూర్తిగా చంపి ఉండేవాడు. ఆవిడ నా సొమ్ముల మూట పడవేయ నిచ్చేవాడు కాదు. స్వామి తన వెంట నంటిరావాలనే ఇది. ఇదంతా స్వామికి మాత్రం తెలియదా ? అతుడూహించినట్టే ఆయన జటాయువు వల్ల విషయం గ్రహించాడు. కిష్కింధకు వెళ్లి సుగ్రీవుడితోనే సఖ్యం చేశాడు. అంతేకాక దుందుభికాయ పదాంగుష్టోత్సారణము, సప్తసాల సమకాల విభేదనము, ఏకైక శరవిక్షేప వాలి హఠాత్ప్రమాపణము ఇలాంటి అతిలోక పరాక్రమ చర్యలు చూపి వాడికి మతిపోగొట్టాడు. వాలిని వధించాడనే సరికిక తప్పకుండా అతడు తన ప్రభువు నారాయణుడే నని నిర్ధారణ అయింది రావణుడికి. ఏమీ తెలియని తారకే అయినప్పుడిక అన్నీ తెలిసిన రావణుడికి కాదా !
Page 316