లేమయ్యారు. అని వాపోతూ రాముడి పరక్రమమంతా పూస గుచ్చినట్టు వర్ణిస్తుంది. సీతా సౌందర్యం వర్ణించి ఆవిడను తేవటమే వాంఛనీయమని మరలా హెచ్చరిస్తుంది. అంతకు పూర్వమా సీతను కురూప అన్నదీ శూర్పణకే. ఇప్పుడు మరలా సురూప ఎలా అయింది దాని కంటికి. అప్పటికది కూడా అన్నతో కలిసి నాటకమాడుతున్నదన్న మాట. దానితో అంతకుముందు మందకొడిగా ఉన్న భావం దృఢమయింది. రావణుడికి. రాముడంటే మానవుడు కాడు. మానవ రూపంలో తనకోసం వచ్చిన ఆదివిష్ణువే సందేహం లేదని మనసులో నిర్ధారణ చేసుకొన్నాడు. దోషాణాంచ గుణానాంచ సంప్రధార్య బలాబలమ్ ఇతి కర్తవ్య మిత్యే వకృత్వా నిశ్చయ మాత్మనః స్థిరబుద్ధిః గుణదోషాలు కలియబోసుకొని చూచి బలాబలాలు నిరూపించి ఇక ఇది తప్పకుండా మనకు కర్తవ్యమేనని స్థిరబుద్ధితో మరలా మారీచాశ్రమానికి బయలుదేరి పోతాడు. ఏమిటా కర్తవ్యం. సీతాపహరణం. అందుకోసం బుద్ధిని స్థిరం చేసుకొన్నాడు. ఈ స్థైర్యమింతకు పూర్వమంతగా లేదు. అందుకే మారీచుడు కాదంటే వాపసు వచ్చాడు. ఇప్పుడిక కాదన్నా లేదు. వద్దన్నా లేదు. చేసి తీరవలసిందే అమ్మవారి అపహరణం. దేనికి ఆమె సౌందర్యం విని ముగ్ధుడయ్యాడు. కాదు. ఆవిడ తన స్వామి నిత్యానపాయిని అయిన శక్తి. ఆ మాయాశక్తిని దూరం చేస్తే ఆయన దాని విరహం ఓర్చుకోలేడు. తప్పకుండా తనకు దర్శనమిస్తాడు. అందుకే ఈ ప్రయత్నం. ఇది లోకుల దృష్టిలో నికృష్టమైనా తన దృష్టిలో మహోత్కృష్టమైన చర్య. గుణదోషాలు బలాబలాలు ఆలోచించే చేస్తున్నాడీ పని. బయలుదేరాడు మారీచాశ్రమానికి. బలవంతం చేశాడతణ్ణి సహాయం చేయమని అది ఎలాంటి సహాయమో తానే వివరిస్తాడు. మాయా మృగరూపం ధరించి సీతారాముల ఎదుట తిరుగు నీవు. నిన్నుచూడగానే ముచ్చటపడి వెంటనే పట్టి తెమ్మని సీత రామ లక్ష్మణులను వేధిస్తుంది. వారు ఇరువురూ ఆవిడను తప్పకుండా విడిచి దూరం పోతారు. నేనప్పుడు ఒంటిగా ఉన్న ఆ మచ్చెకంటిని సుళువుగా అపహరించగలను. ఎలా ఊహంచాడతడు సీత ముచ్చటపడి తెచ్చిపెట్టమంటుందని. రామలక్ష్మణులు అందుకోసం ఆవిడను వదలి తప్పక దూరమవుతారని ఏమో అలా జరుగుతుందో లేదో లేదని ప్రశ్నేలేదు. తప్పక జరుగుతుందని తెలుసు రావణుడికి. భగవత్సంకల్పమదే అయినప్పుడు భక్తుడికెలా తెలియకపోతుంది.
Page 315