#


Index



రామ రావణులు

వేదవతినే పెండ్లాడతాను. నీవు భయపడే వానర ముఖులతోనే వచ్చి నిన్ను డీకొంటానని మౌనంగా స్వామి రావణుణ్ణి హెచ్చరిస్తూ తన స్వరూపాన్ని నాలుగు భాగాలు చేసుకొని నలుగురు సోదరుల రూపంతో ఆవిర్భవించాడు దశరథుడికి.

  తానలా జన్మించిన సంగతి ఇంకా తన భక్తుడికి తెలిసిందో లేదో తల్లిదండ్రుల దగ్గరే గారాముచేస్తూ ఇంట్లోనే కూర్చుంటే ఎలా తెలుస్తుంది. అందుచేత విశ్వామిత్రుడి నెపంతో ఇల్లు విడిచి బయటికి వచ్చాడు. అతని వెంట బయలుదేరి నానా ప్రదేశాలు సంచరించాడు. అస్త్రశస్త్రాలన్నీ పరిగ్రహించాడు. వరుస బెట్టుకొని తాటకను దాని కుమారులను పరిమార్చాడు. అందులోనూ సుబాహుణ్ణి వరిమార్చి మారీచుణ్ణి వదలిపెట్టాడు. దూరంగా బాణంతో దండకారణ్యంలోనే విసిరివేశాడు. మరి ఆ దండకారణ్యమెవరిది. రావణుడిదే గదా. అప్పటికే వాడక్కడ తన సోదరులు ఖరదూషణ త్రిశిరులనే వారిని ఇరువది నాలుగువేల యోధవీరులతో అక్కడ కాపలా పెట్టి ఉన్నాడు. శూర్పణఖ భర్త విద్యుజ్జిహ్వుణ్ణి తెలియక చంపి అది పెనిమిటి పోయాడని ఏడుస్తుంటే దానిని కూడా తమ్ములతోపాటు అక్కడే పోయి ఉండమని ఓదార్చి పంపుతాడు. వారందరి ఉద్యోగము అక్కడ నివసించే తాపసుల యజ్ఞాలకు విఘ్నాలు చేయటం వారిని విరుచుకు తినటమేనని కూడా ఆదేశిస్తాడు. ఇదంతా తన స్వామి రాముడయి అవతరించాడు. త్వరలోనే ధనుర్ధరుడయి సీతా మాతతో అక్కడికి బయలుదేరి వస్తాడని ముందుగా చేసిన సన్నాహమే. మరేదీగాదు. ఆయనకు తెలుసు వాడలా తన కోసమంతా సిద్ధం చేసి ఉంటాడని అందుకే నీతో పని ఉన్నది. నీవు కూడా పోయి అక్కడే ఉండు నేను త్వరలోనే వస్తానని చెప్పి మారీచుణ్ణి అక్కడికే ముందుగా సాగనంపాడు. లేకపోతే చంపకుండా వాణ్ణి అక్కడే విసరి పారవేయట మేమిటి ? వాడక్కడే కూచొని తపస్సు చేయటమేమిటి ? రావణుడికి తెలియదా వాడక్కడ ఉన్నాడని, ఖరదూషణాదులకు తెలియదా గూఢాచారులటూ ఇటూ తిరుగుతుంటారు గదా. వారు వెళ్లి చెప్పరా. చెప్పారు చేశారు. అంతా అయింది.

  ఒక్కొక్క పని చేసి చూపుతున్నాడు రాముడు అది వేయికనులతో చూచి దాని అంతరార్ధం గ్రహిస్తున్నాడు రావణుడు. మానవులవల్ల అవధ్యత్వం కోరడం మరచిపోయావు. మరి మానవుడుగానే జన్మించాను చూడమన్నాడు రాముడు. సరే అనరణ్యుడి శాపమిన్నాళ్లకు ఫలించింది. అలాగే కానీ మని చూస్తున్నాడు రావణుడు.

Page 311

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు