యమధర్మ రాజుకే ఎసరు పెట్టాడు. అతణ్ణి జయించాడు. తరువాత వరుణుని ఓడించాడు. పాతాళానికి పోయి బలిచక్రవర్తినే గెలవాలని చూచాడు. అక్కడ దర్శనమిచ్చాడు హఠాత్తుగా విష్ణువు. ద్వారదేశంలో ద్వారంకంటే ఎత్తుగా నిలుచొని భీకరంగా చూచే ఆ విగ్రహమేమిటో పోల్చుకోలేక పోయాడా ద్వారపాలకుడు. తానాయనకు ద్వారపాలకుడైతే ఆయన ఇప్పుడు మరొకరికి ద్వారపాలకుడు. ఎవరా ద్వారంలో ఉన్నదని బలిచక్రవర్తినే అడుగుతాడు. ఆయన విష్ణువు గదటరా నాయనా అనే సరికి అలాగా ఆయన కోసమే వెదుకుతూ వచ్చానని చెప్పి పరుగు పరుగున వచ్చి చూస్తాడు. చూడబోతే ఎక్కడ ఉన్నాడాయన. అప్పుడే అదృశ్యమై పోయాడు. ఇప్పుడే కాదులే జయా ! ఇంకా ఉంది నీవు నాకోసం చేయవలసిన అన్వేషణా సాధనా. ఆ తరువాతే నీకు నా చేతిలో సిద్ధి అని చెప్పినట్టుంది ఆయన అంతర్ధానం.
అంతేకాదు. ఆ తరువాత కొన్నాళ్లకు రావణుడక్కడ యధేచ్ఛగా విహరిస్తూ ఒక మహాపురుషుణ్ణి దర్శిస్తాడు. నిశ్చల సమాధి నిష్ఠుడైన ఆయనను తనతో యుద్ధం చేయమని నిర్బంధిస్తాడు. ఆయన కరతల ప్రహారం చేసేసరికి క్రిందపడి మూర్ఛిల్లుతాడు. మరలా తెప్పరిల్లి చూచే సరికాయన కన్పించడు. ఎక్కడికి వెళ్లాడని ప్రహస్తాదుల నడిగితే ఇదుగో ఈ బిలంలోకి వెళ్లాడని చెబుతారు. వెంటనే కత్తిదూసి హడావుడిగా దానిలో దూరి వెళ్లి చూడబోతే అది ఒక అద్భుతమైన లోకం. ముప్పది కోట్ల మంది మహాకాయులైన స్త్రీ పురుషులు స్వైరవిహారం చేస్తుంటారు. వారి మధ్యలో నుంచి వెళ్లి చూస్తే అక్కడ చతుర్భుజుడు శంఖచక్ర గదాధారీ అయిన ఒక మహాపురుషుడు శయనించి ఉంటే ఆయన అడుగు దమ్ములొత్తుతుంటుందొక తమ్మికంటి. భువన సుందరి అయిన ఆ మహాలక్ష్మి సౌందర్యానికి పరవశుడయి ఆమె చేయి పట్టుకొనబోతాడు. అది చూచి స్వామి ఒక వికటాట్టహాసం చేసి అర్ధ నిమిలీత నేత్రాలతో చూడగానే మూర్చిల్లి నేలవాలుతాడు మరలా తేరుకొని లేచి ఆయనను చూచి చేతులు ముకుళించి అయ్యా మీరెవ్వరో మహానుభావులు. బ్రహ్మ వర ప్రాప్తిచేత అహంకరించిన నాకు ఎవరివల్లా చావులేదని చేవచూపబోయాను. మీరు నా కాపరాన్ని హరించారు. బహుశా నాకు మరణమనేది ఒకటి ఉంటే తమవల్లనే ప్రాప్తించవచ్చునంటాడు. ఆయన చిరునవ్వు నవ్వి అది ఇప్పుడు కాదు. దానికింకా కొంతకాలం పడుతుంది. అంతవరకూ నీవు నిశ్చింతగా ఉండవచ్చు
Page 308