#


Index



రామ రావణులు

ప్రసాదించే పరమాత్మకంటే భక్త ప్రసన్నుడెవడుంటాడు. వారొకరి కొకరు విహితులంటే _ ఆశ్చర్యమేముంది. అలాంటి వివేచన చేసి చూస్తే ఆశ్చర్యమేమీ లేదని తోస్తుంది. అప్పుడప్పుడు తన భక్తుణ్ణి తనకు దూరం చేసుకోవడమాయన కొకలీల, ఒక వినోదం. ఏమి ఎందుకని, పూర్ణకాముడు గదా ఆయన. వినోదమేమిటి ? అది ఆయనకోసం గాదు. ఆ భక్తుడి కోసమే. తద్వారా మనబోటి సాధకుల కోసం కూడా ఏమిటది. ఎంత భక్తుడైనా జ్ఞాని అయినా ఆ భక్తి జ్ఞానాలింకా పరిపక్వం కాకా పోవచ్చు ప్రమాదానికి గురికావచ్చు. దానికి కారణం పరాపరాలను రెంటినీ ఒకటిగా చూడక పోవటమే. పరమేమిటి. అపరమేమిటి. పరమంటే సాయుజ్యం. అపరమంటే సంసారం. ఇందులో సాయుజ్యమనులోమమైతే సంసారం దానికి ప్రతిలోమం. పైకి ప్రతిలోమంగా కనిపిస్తున్నా ఈ ప్రతిలోమం కూడా విష్ణుమయమే ననిగ్రహించి అందులో నుంచి మరలా తేలిపైకి రాగలగాలి వాడు. అప్పుడిది సంసారమది సాయుజ్యంగాదు. అంతా విష్ణుస్వరూపమే నిత్యము అది తనకు పెన్నిధానంలాగా సన్నిధానమయ్యే ఉందని గ్రహించి నిర్వృతి చెందుతాడు భక్తుడు. అప్పుడు భక్తుడు కాడతడు. భగవంతుడే.

  ఇలాంటి భగవత్స్వరూపాన్ని అతని కాపాదించటానికే ఆపాదించి మనబోటి ముముక్షువులకు మోక్షసాధన రహస్యాన్ని ప్రకటించటానికే శాపంమీద నెపంపెట్టి తన ద్వారపాలకులనే భూలోక పాలకులను, కాదుకాదు పాతాళలోక పాలకులను చేసి క్రిందకి విసరివేశాడా పరమాత్మ. భూలోకమంటే రజోగుణం. పాతాళమంటే అది తమోగుణం. అట్టడుగున ఉండే తమస్సనేదేమిటో మొదట అర్ధం చేసుకోవాలి వాడు. తరువాత అంతకు పైనున్న రజస్సును చేసుకోవాలి. ఆ తరువాత సత్త్వానికి రావాలి. అంటే అవి రెండూ కూడా సత్త్వంలో కలుపుకొని ఒకే ఒక గుణంగా మార్చుకొని ఆ గుణాన్ని కూడా గుణి అయిన తానుగానే భావించి చివరకు గుణగుణి రూపమైన ఈ భేదమభేద రూపమైన తన ఆత్మచైతన్యమే నని అనుభవానికి తెచ్చుకోవాలి. అదే పరాకాష్ఠ జ్ఞానానికి. ఇలాంటి అభేద దృష్టి అలవడాలంటే మరి కేవల సత్త్వమేనని కూర్చుంటే ఎలా ? రజస్తమస్సులతో కూడా కుస్తీ పట్టవలసిందే. అందుకే కృతంలో హిరణ్యకశిపుడుగా త్రేతలో రావణుడుగా జన్మించాడా జయుడు. తాను జన్మించి తమ్ములనెపంతో తమస్సును చవిచూచాడు. దానిని దాటి రజస్సులో

Page 300

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు