రామాయణంలాంటి కావ్యనిర్మాణం చేయాలంటే ఆ నిర్మాత అయిన మహాకవి జీవితమెలాంటిదయి ఉండాలి. ఎంత ఎత్తులకెదిగినదయి ఉండాలి. అది సంకుచితమైన సర్వభావాలనూ ఒక వల్మీకంలాగా భేదించుకొని బయటపడాలి. పైకిలేవాలి. చతుర్ముఖుడయి నలువైపులా చూపు ప్రసరింపజేయాలి. ఒక్కమాటలో చెబితే ఋషి అనిపించుకోవాలి. ఋషి అంటే క్రాంతదర్శి, ద్రష్ట అనే గదా వర్ణించాము.
అయితే ఇలాంటి ద్రష్టృత్వం లేదా ఋషిత్వమనేది ఊరకరాదు. దానికి స్వాధ్యాయనిరతీ, తపోనిరతీ, మౌననిరతీ ఈ మూడుగుణాలూ ఒకదానితరువాత ఒకటి ఉండి తీరాలి. ఇందులో ఏది లోపించినా అది ప్రాప్తించదు. ఉత్తమకళాకారుడి కివి మూడు అవశ్యంభావులు. ఇందులో మొదటిది స్వాధ్యాయం. స్వ అంటే తన పాటికితానైనా తనకోసం ఇతరుల మూలంగానైనా అధ్యాయమంటే సకలవిషయాలూ గ్రహించటం. జీవిత సత్యాలనన్నింటినీ తెలుసుకోవటం. తెలుసుకోవచ్చు తెలిసినంత మాత్రానమరలా ప్రయోజనంలేదు. అది తీర్థానికి తీర్థం ప్రసాదానికి ప్రసాదంలాగానే ఉండిపోతే ఏమి సుఖం. సమన్వయం కావాలి. సమన్వితమైన జ్ఞానమే ఫలితమిచ్చేది. ఇది మననంవల్ల గాని సిద్ధించదు. ఈ మననమే తపస్సంటే. బాహ్యాభ్యంతర సమాధానమ్ తపః తపస్సంటే లోపలా వెలపలా విప్రకీర్ణంగా ఉన్న అన్ని విషయాలనూ ఒకే ఒక సూత్రంతో ముడిపెట్టి పట్టుకోటం. అయితే అలా పట్టుకొన్నాము మంచిదే. ఆ పట్టుకొన్నది మరలా పట్టు సడలి జారిపోరాదు. పోగు చేసుకున్న ధనంలాగా నిరంతరమూ కాపాడుకోవాలి. దానికి నిదిధ్యాసన అని పేరు. ఏకధారగా ఒకసూత్రాన్ని పట్టుకొని కూచోటమే నిదిధ్యాస. దీనికే మనం మౌనమని పేరు పెట్టాము. ఇంతకూ స్వాధ్యాయ తపోమౌనాలంటే మరొక మాటలో చెబితే శ్రవణ మనన నిదిధ్యాసలే. "తపస్స్వాధ్యాయ నిరతస్తపస్వీ మునిపుంగవః” అని వాల్మీకికి మూడు విశేషణాలు వాడారంటే అందులో ఇదే అంతరార్ధం. ఈ శ్రవణ మననాదుల వల్లనే అతడు త్రికాలజ్ఞుడైన మహర్షి అయ్యాడని భావం. అప్పుడే అతడు ప్రాచేతసుడుకూడా అనిపించుకొంటాడు. ప్రకృష్ణ జ్ఞానసంపన్నుడేగదా ప్రాచేతసుడంటే. ప్రకృష్ణజ్ఞానమెలా లభిస్తుంది. ఈ శ్రవణాది త్రిపుటిమూలంగానే మరొక మార్గంలేదు.
Page 30