క్రౌంచ మిధునంలోని పురుష పక్షిస్థానంలో ఉన్న పాత్రలే. చిత్రమేమిటంటే ముగ్గురినీ వధించాడు ధర్మస్థాపకుడైన ఆ మానిషాదుడు రాముడనే వ్యాజంతో సాక్షాత్తుగా వాలి రావణులను వధిస్తే పరోక్షంగా అరణ్యగమనంతో దూరమై తన తండ్రి దశరధుడికే ప్రాణవియోగం కల్పించాడు. ఇంతకన్నా మహాకవి చూపవలసిన ప్రౌఢి మరి ఏమున్నది. ఇంతేగాక మరి ఒక సాహిత్యనిర్మాణ రహస్యం కూడా మనకీ కిరాతద్వయ సన్నివేశాలు రెండూ సున్నితంగా పట్టి ఇస్తున్నాయి. ఒక ఉదాత్త గంభీరమైన సాహిత్యాన్ని సృష్టించటమనేది మాటలుకాదు. అది సర్వదేశకాలాల పరిధిని దాటి సర్వులకూ ప్రియహితకారి అనిపించుకోవలసిన కళ. అలాంటి కథ అనన్య సామాన్యంగా అనిదంపూర్వకంగా తీర్చిదిద్దాలంటే ఆ దిద్ది తీర్చే మహాకవికెంతో ప్రతిభాసంపత్తి ఆవశ్యకం. ఇతిహాసాని కవతారికా రూపంగా నడచిన ఈ రెండింటిలో మనమీ సంపత్తినే దర్శించవచ్చు.
మహర్షి మొదట వల్మీకంనుంచి జన్మించాడనే మాటేచూడండి. వల్మీకమనేది మానవుడి పామరమైన జీవితానికొక ప్రతీక. రజస్తమో గుణాత్మకమది. రజస్సంటే విక్షేపం. తమస్సంటే ఆవరణం. మానవుడి బుద్ధిని చుట్టుముట్టి సంకుచితంచేసి దానిని కేవలమూ ప్రాపంచికంగా పామరంగా మారుస్తా యవిరెండూ. వీటిబారిన పడ్డవాడెప్పుడూ పరమకిరాతకంగానే బ్రతుకుతుంటాడు. ఈ పాశవమైన బ్రతుకే ఒక వల్మీకం మన పాలిటికి. ఎప్పటికైనా దీనిపట్టు తప్పించుకొని బయటపడాలి. అందుకోసం పెద్దలను సేవించి వారివల్ల ఉత్తమ సంస్కారాన్ని గడించాలి. అలాంటి సంస్కారబలంతో బయటపడటమే వల్మీకాన్ని భేదించుకొని పైకిలేవటం. అంటే ప్రాకృతమూ స్వార్థపరమూ అయిన ప్రవర్తనకు స్వస్తి చెప్పి అప్పటినుంచీ సంస్కార వంతమైన దృష్టి నలవరచుకొంటాడని భావం. అదే క్రాంతదర్శనం మానవుడికి. దానితో సంకుచితమైన దేశకాలాద్యవధులను దాటి సార్వకాలికమైన సార్వజనీనమైన మార్గాన్ని సేవిస్తాడు భావిస్తాడతడు. ఇదే ఋషిత్వమంటే వాల్మీకి ఋషిగా మారాడంటే ఇదే అర్థం. పరిచ్ఛిన్నమైన దృష్టి తొలగి విశాలమైనదృష్టి అలవడిందతనికి. ఒక ఉత్తమ సాహిత్య సృష్టి చేయటాని కుండవలసిన మొట్టమొదటి అర్హత ఇది. ఒక ఉదాత్తమైన కావ్యాన్ని సృష్టించే కవికూడ ఉదాత్త స్వభావుడే అయి ఉండాలని అభిజ్ఞులమాట. దృష్టిలో లేని గుణం అతని సృష్టిలో తారసిల్లటం కలలోని వార్త.
Page 29