#


Index



సీతా మందోదరులు

ఒక మానవుడివల్ల ఇలాంటి ముప్పు నీకు సంభవించటమా అని పలవిస్తుంది. ఇది ఎంత అజ్ఞానమో చూడండి. అంతకుముందు సీతారాములు దైవస్వరూపులై ఇంత లోపలనే కాకుండా పోయారా.

  కాదు. ఆవిడ స్వభావమలాంటిది. అసురామయ గదా ఆవిడ. అసురుణ్ణి ఆశ్రయించి అసుర వైభవమే శాశ్వతమని భావించి అలాగే బ్రతుకదలచింది. ఉన్నట్టుండి అది ఉల్టా సీదా అయ్యేసరికిప్పుడు పరితపిస్తున్నది. అలా కాకుంటే ఆవిడకు రాముడూ లేక్కలేదు. సీతా లెక్కలేదు. ఆ మైకంలోనే పడి అలాగే ఉండిపోయేది. మధురమైన ఆ స్వప్నం విరిసిపోవడంవల్లనే ఈ వైరాగ్యం. ఇది అభావ వైరాగ్యమే. ఈ భావమావిడ మాటల్లోనే బయటపడుతుంది మనకు. కైలాసే మందరే మేకాతథా చైత్రరథేవనే - దేవోద్యానేషు పర్వేషు విహృత్య సహితాంత్వ మూపశ్యంతీ వివిధాన్ దేశాన్ తాంస్తాం శ్చిత్రస్ర గంబరా చక్కగా వస్త్రాభరణాదులు ధరించి నీతోపాటు పుష్పక విమానంలో కూచొని కైలాస మందరమేరు నందనాది దివ్య సీమలలో ఎలా విహరించినదానను నేను. భ్రంశితా కామభోగేభ్య స్సాస్మి వీర సైవాన్యే వాస్మి సంవృత్తా. అవన్నీ కోలుపోయి ఇప్పుడనాధనయి ఆ మందోదరేనా ఈవిడ అని నలుగురూ సందేహించవలసి వస్తున్నది. చూడండి భర్తతో అన్ని వైభవాలు అనుభవించేటప్పుడు ఆయా దేవఋషి గణాలు ఎలా బాధపడుతున్నా ఆవిడ కక్కరలేదు. ఆ భోగభాగ్యాలనుభవించటమే జీవిత పరమావధి. అవి మాయ మయిపోయాయనే ఇప్పుడీ నిర్వేదం. పైగా మైథిలీ సహరామేణ విశోకా విహరిష్యతి అల్ప పుణ్యాత్వహం ఘోరే పతితా శోకసాగరే. జానకికేమి. హాయిగా నిశ్చింతగా తన నాధునితో ఇక ఎలాగంటే అలా స్వేచ్ఛగా విహరిస్తుంది. మరి నేనో అభాగ్యురాలిని. అగాధమైన శోకసాగరంలో తలక్రిందులుగా పడిపోయాను. చూడండి. ఈ మాత్సర్యం. ఆవిడ అశోక వనంలో సంవత్సర కాలం నానాకష్టాల పాలయి శోకిస్తుంటే చీమకుట్టినంత మాత్రం లేదు తనకు. సాటి ఆడది గదా అని ఒక్కనాడైనా పోయి అనునయించిన పాపాన పోలేదు. కనీసం త్రిజట అయినా మేలు. సరమ అయినా మేలు. సానుభూతి అయినా చూపారు. పోతే నిమ్మకు నీరెత్తినట్టు కూచున్న ఇల్లాలు తాను. ఇప్పుడెలా వాపోతున్నదో చూడండి. ఆవిడ శోకం తనకు మార్పిడికాగానే లోకమంతా కుంగిపోయినంత పనిగా మాట్లాడుతున్నది.

Page 292

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు