కూడా బాధ లేకుండా పోయింది. అంతేకాదు. సత్వమ్ మానుష మాత్రేణ రామేణయుధి నిర్జితః నవ్యపత్రపసే రాజన్ కిమిదం రాక్షసర్షభ. అలాంటి నీవొక మానవ మాత్రుడి చేతిలో పరాజితుడవయినందుకు నీకు సిగ్గనిపించటం లేదా అని అడుగుతుంది. అడగటానికి కతడెక్కడ ఉన్నాడని. ఎలా బదులు చెబుతాడని. అది కాదు. ఒక మనుష్యమాత్రుడి చేతిలో తన నాధుడోడి పోవటమనేది ఆవిడ కవమానకరం. చూడండి. ఎంత దురభిమానమో, ఎంత అజ్ఞానమో, కధమ్ త్రైలోక్యమాక్రమ్య – శ్రియా వీర్యేణ చాన్వితమ్ - అవిషహ్యం జఘావత్వామ్ మానుషో వనగోచరః త్రిలోకాలనూ గడగడలాడించిన నిన్నొక వనవాసి అయిన మానవుడోడించటమా? వధించటమా? మానుషాణామ విషయే చరతః కామరూపిణః మనుష్యజాతికి గోచరంకాని కామరూపుడవు నీవు. మరి ఎలా జరిగిందింతపని. మనుష్యుడి చేతిలోనే గదా అతడు మరణించాడు. మనుష్యుల కతీతుడయితే ఎలా దెబ్బతిన్నాడు తన భర్త.
ఇక్కడే ఉంది రహస్యం మందోదరికేమీ తెలియదనుకొంటున్నాము మనం. అంతా తెలుసు. మొదటినుంచీ తెలుసు. సీతను కొనిరాక ముందూ తెలుసు. అదే గదా ఇంతకుముందు ప్రస్తావించిన భర్త పరాక్రమాదులు. ఆ మహాతల్లిని తెచ్చిన తరువాత తెలుసు. అదే ఇప్పుడు బయటపెడుతున్నది చావుకబురు చల్లగా చెప్పినట్టు. యదై వచ జనస్థానే రాక్షసైర్బహుభిర్వృతః ఖరస్తవ హతో భ్రాతా - తదై వాసౌనమానుషః ఎప్పుడు నీ తమ్ములు ఖరదూషణులు చతుర్దశ సహస్ర సంఖ్యాకులైన సైనికులతో సహా రాముడి చేతిలో నిహతులైనారో అప్పుడే అతడు మానవుడు కాడు. యదైవ నగరీం లంకాం దుష్ప్రవేశాంసురైరపి - ప్రవిష్టో హనుమాన్ వీర్యాత్ - తదైవ వ్యధితావయమ్. ఎప్పుడా హనుమంతుడనే వానరుడు అతి దుష్ప్రవేశమైన మన లంకా నగరాన్ని అవలీలగా ప్రవేశించాడో అప్పుడే దెబ్బ తిన్నాము మనమంతా. అంతేకాదు. యదైవ వానరైః ఘోరైర్బద్ధ స్సేతుర్మహార్ణవే. తదైవ హృదయేనాహం శంకే రామమానుషమ్. ఎప్పుడైతే వానరులంతా కలిసి సముద్రంమీద సేతువు కట్టి వచ్చి మన పట్టణంమీద పడ్డారో అప్పుడే అనిపించింది నాకు రాముడు మానవుడు కాదని. అసలు నన్నడిగితే రాముడని కాదు. రామరూపేణ కృతాంతః మాయాంతవ వినాశాయ. నీ వినాశం కోసం మాయాశక్తిని ప్రయోగించి ఉంటాడు. ఆ మాయ ఎవరని ఆమె ఉద్దేశం. సీతే ఆ మాయ.
Page 288