#


Index



సీతా మందోదరులు

మాయల్లో ఇమిడి ఒక మహామాయ దాగి ఉంది. సీతాదేవి ప్రవర్తనలో బాహ్యానికి వైరుధ్యం గోచరిస్తే ఆంతర్యంలో సమన్వయముంటుంది. పోతే మందోదరి వ్యవహారంలో బాహ్యానికెంతో సామరస్యమున్నట్లు గోచరమైనా ఆంతర్యంలో వైషమ్యముంటుంది. అది దేవ మాయ గనుక పైకెలా ఉన్నా అంతశ్శుద్ధి గలది. ఇది అసురమాయ గనుక లోపల ఎలా ఉన్నా పైకి మాత్రం పవిత్రంగా భాసిస్తుంది. ఉదరమంటే లోపల అనే అర్థం. అది మందం. అంటేదృఢంగా లేదని భావం. అలా మందోదరి అయినా అమందంగా భాసిస్తుందదే అసుర మాయలో దాగి ఉన్న మర్మం. చిదభిన్న కాబట్టి దేవమాయ తేజోరూపిణి. భర్గోదేవస్యతమో రూపిణి ఎలా అవుతుంది. తమోరూపిణిగా నటించినా తేజోరూపిణే అది. కాగా ఇది చైతన్యచ్ఛాయ గాని అసలైన చైతన్య జ్యోతికాదు. కాబట్టి ఎంత తేజోరూపిణిగా నటించినా వాస్తవానికి తమోరూపిణే. అది వెలుగైతే ఇది దాని నీడ. అది వస్తువైతే ఇది దాని ఆభాస. అయినా వస్తువులాగా భాసిస్తుంది. భ్రమ పెడుతుంది. అదే దాని చమత్కారం.

  అంతెందుకు. హనుమంతుడి లాంటి అష్టసిద్ధులు సాధించిన మహాయోగే భ్రమపడ్డాడావిడను చూచి. రావణుని శయన మందిరంలో గరుడ గంధర్వాది కాంతల మధ్య ఆయనకు దగ్గరగా పడుకొని ఉన్న ఆవిడ శరీరసౌష్టవం చూచి తప్పకుండా ఈవిడ సీతే అయి ఉంటుందని హర్షంతో చిందులు త్రొక్కాడు. ఆ తరువాత గాని అతడి కాలోచన రాలేదు సీత కాదని. ఎలా వచ్చిందా ఆలోచన. సీతే అయితే రావణుడి ప్రక్కనెలా శయనిస్తుంది. ప్రాణం పోయినా అలాంటి పని కొడిగడుతుందా ఆ జగన్మాత. మరి అలా పడుకొన్నదంటే ఈవిడ ఈ అసురేంద్రుడి పట్టమహిషి మందోదరి అయి ఉంటుందని సంశయ నివృత్తి చేసుకొన్నాడు. అంటే ఏమని అర్ధం. ఏది దేవమాయో ఏది అసుర మాయో ఈ అంశాన్ని బట్టే నిర్ణయించవచ్చు నన్నమాట. ఏమిటా అంశం. దేవుణ్ణి భజిస్తే అది దేవమాయ. అసురుణ్ణి ఆశ్రయిస్తే అది అసురమాయ. అసురమైన బుద్ధి ఉన్నప్పుడే గదా అది ఆసురుణ్ణి ఆశ్రయిస్తుంది.

  మందోదరి కావాలనే రావణుణ్ణి కోరి పెండ్లాడింది. మయుడనే దానవశిల్పి కూతురావిడ. వాడు దేవతలను తన పనితనంతో మెప్పించి హేమ అనే అప్సరసతో బహుకాలం విహరించాడు. దానికోసం ఒక పెద్ద పట్టణాన్ని ప్రమదవనాన్ని నిర్మించాడు. అది వదిలివేసిన తరువాతనే దాని సఖి స్వయంప్రభ అనే తాపసి

Page 283

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు