#


Index



సీతా మందోదరులు

సలహా ఇస్తుంది. అయినా తాపసులకు మనకెందుకండీ ఆయుధాలు. రాక్షసులు మనకేమి అపకారం చేశారని వారిని శిక్షించటమని నీరు కారుస్తుంది. మారీచు డనేకసార్లు మారువేషంలో వచ్చి తమ్ము బెదిరించిన సంగతి తెలుసు నావిడకు. అయినా వాడు లేడి వేషంలో వస్తే మరలా దాన్ని పట్టి తెమ్మని మొండిపట్టు పట్టింది. భర్తతోపాటు వనభూములకు వచ్చింది. అలాంటి తాను ఒక పనికిమాలిన మృగంమీద మోజుపడి కడకు దాన్ని చంపి దాని చర్మాన్నైనా తెచ్చి ఇమ్మని ఎక్కడలేని చాపల్యాన్ని చూపుతుంది. మరిది తన్ను వదిలిపోయే వరకూ అతణ్ణి అనరాని మాటలన్నీ అంటుంది. అయ్యో అలాంటి సజ్జనుణ్ణి అలా అనబట్టే గదా ఇప్పుడిన్నికష్టాల పాలయ్యానని పశ్చాత్తాప పడుతుంది. నా భర్త ఎంతటి మహానుభావుడు. అలాంటి దృఢవ్రుతడు లేడని నలుగురి ఎదుటా ప్రశంసిస్తుంది. స్త్రీభిస్తుమన్యే విపులేక్షణాభిః త్వంరంస్యసే నీవెప్పుడో రాక్షసుల చేతిలో హతమయి ఉంటావు. ఈ పాటికి స్వర్గలోకానికి పోయి అక్కడ నేను లేననే ధైర్యంతో రంభాద్యప్సరసలతో క్రీడిస్తుంటావని అభాండం వేస్తుంది. అతడు మహా బలసంపన్నుడు. దేవతలైనా భయపడవలసిందే నంటుంది. అయ్యో ఏ రాక్షసులచేత ఏమాపద మూడిందో అసలున్నాడో లేడో ఈపాటి కేమయ్యాడోనని వాపోతుంది. పాపం హనుమంతుడు లోకమో పాడోనని అమ్మా నా వీపుమీద కూచొనిరా నిమిషంలో రామపాద సన్నిధి చేరుస్తానని అమాయికంగా అంటే నీవే మనుకోకు. నేను పరపురుష శరీర స్పర్శ చేయనంటుంది. మరి రావణ కరస్పర్శ ఎలా జరిగిందని అడిగితే అది నా వశంలో లేక జరిగింది. దానికి నేనెలా బాధ్యురాలనంటుంది. అంతేకాదు. రాను పొమ్మని అంత నిర్మొగమోటంగా హనుమంతుడికి చెప్పిన మనిషి మరలా అశోకవనంలో రాక్షస బాధలు పడలేక అయ్యో ఆ హనుమంతుడెంత మంచివాడు. అతనితో వెళ్లి ఉన్నా బాగుండేది గదా అని పలవిస్తుంది ఇంతెందుకు. భర్తను కట్టుకొన్నప్పటి నుంచి కడదాక ఆయన చెప్పిన మాట జవదాటరాదు గదా తాను. మరి ఆ భర్త చివరకందరి ఎదుటా నీ నిష్కల్మషత్వాన్ని నిరూపించుకోమంటే అది వినిపించుకోకుండా ఒక్కమాట చెప్పకుండా భూగర్భంలోకెళ్లి కూచోటమేమిటి ? అంతా అభినయమే. ఆమె కభినయమైతే మనకది అయోమయం. శ్రీతత్త్వాన్ని శ్రీ భూమికలో అర్ధం చేసుకోవాలి గాని భూతత్త్వమనే దృష్టితో చూడరాదు. చూస్తే భూసంబంధిగానే కనపడుతుంది.

Page 281

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు